బంక్‌లు బంద్

3 Mar, 2014 04:53 IST|Sakshi

జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి పెట్రోలు బంకుల యజమానులు మెరుపు సమ్మెకు దిగా రు. ఫలితంగా జిల్లాలోని 220 బంకులు నిరవధికంగా మూతపడ్డాయి. వీరి ఆందోళన ఫలితంగా లక్షలాది వాహనాల చోదకులకు అవస్థలు మొదలయ్యాయి.

తూనికలు కొలతల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం బంకులపై దాడులు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్నవాటిని సీజ్ చేస్తుండటం, లక్షలాది రూపాయలు అపరాధరుసుం వసూలు చేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంకుల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు.

ఈ సందర్బంగా గుంటూరులోని లాడ్జిసెంటర్‌లోగల బంకు యజమానుల యూనియన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం యూనియన్ జిల్లా అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తూనికలు, కొలతల శాఖ అధికారుల మొండివైఖరివల్లే తాము సమ్మె చేపట్టామని వెల్లడించారు. పదేళ్లుగా ఆయిల్ కంపెనీలే బంకులకు పంపులను సరఫరా చేసేవారనీ, వాటిని తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసిన తరువాతనే వినియోగించేవారమని తెలిపారు. కానీ అర్ధంతరంగా చమురు కంపెనీలు, పంపుల తయారీ కంపెనీలతో తలెత్తిన మనస్పర్థల కారణంగా బంకుల్లో వినియోగిస్తున్న పంపుల్లో తప్పులున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఏటా అధికారులు తనిఖీలు నిర్వహించి, పంపులపై ముద్రలు వేస్తారని ఇప్పుడు ఆ విధానానికి స్వస్తిపలికి ఏకంగా అక్రమాలు జరిగాయం టూ లక్షలాది రూపాయలు జరిమానా విధించడం సరికాదని పేర్కొన్నారు. డ్రైస్‌వైన్ కంపెనీకి చెందిన పంపులు వినియోగించుకోవచ్చని గతంలో తూనికలు కొలతల శాఖ అమోదించిందనీ, ఇప్పుడు దానినీ అనుమానిస్తోందని చెప్పారు. ఒక పంపు ఏర్పాటు చేయాలంటే వ్యయం లక్షల్లో ఉంటుందని, ఏర్పాటు చేయటానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందన్నారు. పంపుల తయారీ కంపెనీలతో వివాదం వల్ల బంకులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

జిల్లా వ్యాప్తంగా రోజూ 9లక్షల లీటర్ల పెట్రోలు, 27లక్షల లీటర్ల డీజిల్ వినియోగదారులకు అందిస్తున్నామనీ, బంకులు నిలుపుదల చేయటం వల్ల ప్రజల్లో తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేసి రాతపూర్వకంగా పంపులు వినియోగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసే వరకూ సమ్మెద్వారా నిరసన తెలుపుతామన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు