వారానికో పీహెచ్‌సీ సందర్శన

31 Jul, 2014 00:22 IST|Sakshi
  •      జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆకస్మిక తనిఖీలు
  •      సబ్బవరం తహసీల్దార్‌పై ఆగ్రహం
  • సబ్బవరం: జిల్లాలోని పీహెచ్‌సీలను ఒక గాడిన పెట్టేందుకు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ నడుం బిగించారు.  ప్రతి వారం ఒక పీహెచ్‌సీని సందర్శించేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మండలంలోని గుళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన ఆస్పత్రిలో సమస్యలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

    పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్లు, అటెండర్లు అవసరమని పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ సుజాత  కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసి తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులతో రేషన్ కార్డులు అనుసంధానం, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఆన్‌లైన్  ఎలా జరుగుతోందని ఆర్‌ఐని అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్  విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య నిపుణులు కొరత ఉందని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2866 మంది బడికి రాని బడిఈడు పిల్లలను గుర్తించామన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సర్వే నెంబరు 255లో ఆక్రమణకు గురయిన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎమ్. నాగభూషణరావు, ఎంపీడీఓ ఎస్. త్రినాథరావు, ఆర్‌ఐలు అరుణ్‌కుమార్, రమేష్ ఉన్నారు.
     

మరిన్ని వార్తలు