ఇళ్ల స్థలాలు కేటాయించాలి

5 Nov, 2013 01:36 IST|Sakshi

గుంటూరు సిటీ, న్యూస్‌లైన్ :దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాకే.. ప్రభుత్వం స్థలంలోని పూరిళ్లను తొలగించాలని తెనాలి మున్సిపాలిటీ రెండోవార్డు హయ్యర్‌పేట గుడిసెవాసులు కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్‌కు అర్జీ అందజేశారు. దశాబ్దాలుగా మున్సిపాలిటీ స్థలాల్లో పూరిళ్లు వేసుకుని జీవి స్తున్నామని, ఇటీవల మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారని బాధితులు  పి.తిరుపతయ్య, జె.కిషోర్,  జి.చిట్టిబా బు, వి.సుబ్బారావు తదితరులు వాపోయారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, అదనపు జేసీ నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 ఉపాధి హామీ పనుల్లో ఫీల్డు అసిస్టెంట్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంనకు చెందిన బి.నాయక్ తదితరులు ఫిర్యాదు చేశారు.చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడంతో పరిసర ప్రాంతాల ఇళ్లలోకి వర్షపునీరు చేరుతోందని.. ఆక్రమణలు తొలగించాలని మండలకేంద్రం పెదకాకాని నగరంపాలెంనకు చెందిన జి.మల్లికార్జునరావు, వి.మోహనరావు తదితరులు అర్జీ అందజేశారు.భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.15వేల నుంచి 20 వేలు నష్టపరిహారం అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు,
 
 రైతు నాయకులు ఎన్.గురవయ్య, టి.బాబూరావు తదితరులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి, మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని విన్నవించారు. 1998లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 44 ఎకరాల 37 సెంట్ల భూమికి సంబంధించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని యడ్లపాడు మండలం తుర్లపాడు రైతులు వినతిపత్రం సమర్పించారు. రైతు నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్, జంపని వీరయ్య, కొల్లా రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.గుంటూరు రూరల్ మండలంలోని రత్నగిరి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఆ కాలనీకి చెందిన ఎస్.నరసింహారావు, వెంకటమ్మ, వూట్లు కోటేశ్వరమ్మ తదితరులు విన్నవించారు.
 

మరిన్ని వార్తలు