ప్లీజ్..అడవులకొచ్చి బలికావద్దు

17 Mar, 2015 04:25 IST|Sakshi

రేణిగుంట : అమాయకత్వంతో శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చి అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు.. ప్లీజ్.. అంటూ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ఎర్రచందనం కూలీలను వేడుకున్నారు. రేణిగుంట పట్టణ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులోని సేలం, ధర్మపురి, తిరువణ్ణామైలై, తిరువళ్లూరు ప్రాంతాల నుంచి అధికంగా ఎర్ర కూలీలు వస్తున్నారని, కిలోకు రూ.300లు ఇస్తారనే ఆశతో వచ్చే కూలీలు, మేస్త్రీలు దయచేసి మానుకోవాలని కోరారు. శేషాచల అడవులను కాపాడుకోవాలనే దృఢసంకల్పంతో అటవీ, పోలీసు శాఖలు టీమ్ స్పిరిట్‌తో ధైర్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు. త్వరలో గ్లోబెల్ పొజిషన్ సిస్టమ్, అడవుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గగనతలం నుంచి అడవులను పరిశీలించే విధానాల ద్వారా అటవీ సంపదను కాపాడుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు.
 
5.5టన్నుల ఎర్రచందనం స్వాధీనం
రేణిగుంట మండలం కృష్ణాపురం సమీపంలోని రాళ్లకాల్వ వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 5.5 టన్నుల(184 దుంగలు)ఎర్రచందనం దుంగలను సోమవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ కాంతారావు తెలిపారు. సుమారు 200 మంది ఎర్రకూలీలు రాళ్ల వర్షం కురిపించినా ఆత్మస్థైర్యంతో ఎదిరించి ఎర్ర సంపదను కాపాడినట్లు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ చురుకుగా కదలడంతో ఎర్ర కూలీలు పారిపోయారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో వారు వదలిపెట్టిన బ్యాటరీలు, సంచులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడులు నిర్వహించడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎఫ్‌వో శ్రీనివాసులు, రేణిగుంట డీఎస్పీ నంజుండప్పను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సీఐ బాలయ్య, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు