పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం

3 Nov, 2018 11:31 IST|Sakshi

అకస్మాత్తుగా నెర్రలుబాసిన రోడ్డు

ఏజెన్సీ ప్రాంతానికి రాకపోకలు బంద్‌

సాక్షి, పోలవరం/ పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. రోడ్డంతా పెద్ద పెద్ద నెర్రెలు బాసింది. దీంతో భూకంపం వచ్చిందన్న భయంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి ఆ రోడ్డు గుండా రాకపోకలు నిలుపుదల చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇంజనీరింగ్‌ అధికారులు అధికారులు పగులు తీసిన ప్రాంతాన్ని పరిశీలించారు. భూ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోవడం వల్లనే రోడ్డు పైకి చొచ్చుకుని వచ్చిందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న పోలవరం డంపింగ్‌ కారణంగానే భూమి నెర్రలు తీసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రహదారిని మూసివేయడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రమాదమేమీ లేదు..
పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదమేమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ పరిశోధన మరియి హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాంతంలో ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పోలవరం ప్రాంతాన్ని సమీక్షిస్తున్న ఆర్డీజీఎస్‌ అధికారులు ఈ మేరకు తెలిపారు.

మరిన్ని వార్తలు