పోలీస్‌ సంఘాల ఎన్నిక గ్రహణం వీడేనా ?

25 Feb, 2019 13:12 IST|Sakshi
జిల్లా పోలీస్‌ కార్యాలయం

హైకోర్టు స్టేతో నిలిచిన సంఘాల ఎన్నికలు

కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన శివానంద్‌

హడావుడిగా అడ్‌çహాక్‌ కమిటీలను ఏర్పాటు చేసిన ఎస్పీలు

మళ్లీ తాజా నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో పోలీస్‌ అధికారుల సంఘాల పదవీ కాలం ముగియడంతో గత నెల 7న తాజాగా నూతన సంఘాల ఎన్నికకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 19లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఎన్నిక ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందనుకుంటున్న నేపథ్యంలో నిలిపి వేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ఎత్తివేయడం లేదా తాజా నోటిఫికేషన్‌ వెలువడితేనే ఎన్నికలు జరుగనున్నాయి.

అసలు ఏం జరిగింది ?
పోలీస్‌ సంఘాల బైలా ప్రకారం చార్జి మెమోలు, మేజర్‌ పనిష్‌మెంట్లు విచారణ దశలో ఉన్నప్పటికీ వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. అయితే, తాజాగా ఆనిబంధనను మార్పు చేసి చార్జి మెమోలు, పనిష్‌మెంట్లు పెండింగ్‌ ఉన్నవారు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని బైలాలో కొత్తగా నిబంధన పెట్టారు. ఇదంతా స్వార్థపరులైన వారు అవకాశవాదంగా కొత్త నిబంధన పెట్టారంటూ కొందరు పోలీసులు వ్యతిరేకించారు. క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన పోలీస్‌ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు శివానంద్‌ నూతన నిబంధన తొలగించాలని,  మూడేళ్ల పాటు సంఘం ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం సరైన విధానం కాదని హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ జనవరి 16న హైకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

డీజీపీని కలసిన రాష్ట్ర సంఘం నాయకులు
ఇదిలా ఉంటే నూతన నిబంధన ఇబ్బందిగా మారిందని, పెండింగ్‌లో చార్జి మెమోలు ఉన్నప్పటికీ వారికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలంటూ గత ఏడాది డిసెంబరులో రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం నాయకులు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ను కలసి కోరారు. అందుకు ఆయన అంగీకరించి అలాంటివారు ఎవరైనా పోటీ చేయాలనుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు అర్బన్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐతో పాటు నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మరో సీఐ కూడా గత నెలలో జరిగిన ఎన్నికల్లో పోటీలో నిలిచారు.

హడావుడిగా అడ్‌హాక్‌ కమిటీలు
ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్, రూరల్‌ ఎస్పీలు అడ్‌çహాక్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు వారికి అనుకూలంగా వ్యవహరించే వారిని కూడా కమిటీల్లో నియమించారని పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కమిటీ ఎన్నిక ఏకపక్షంగా నిర్వహించిన కారణంగా, రాబోవు ఎన్నికల్లో సమస్యలు తప్పవని తలలు పట్టుకుంటున్నారు. పోలీస్‌ సంఘాలు ఉంటేనే అంతంత మాత్రంగా పరిష్కారం అయ్యే సమస్యలు రానున్న రోజుల్లో మరిన్ని ఎదుర్కొక తప్పదంటూ నిట్టూరుస్తున్నారు. ఏది ఏమైనా పోలీస్‌ సంఘాల ఎన్నిక గ్రహణం వీడితేనే.. సమస్య ఓ కొలిక్కి వచ్చి ఎన్నిక జరిగే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు