అడ్డంగా దొరికిన ఏపీ మంత్రి పీతల

4 Jun, 2015 04:08 IST|Sakshi
అడ్డంగా దొరికిన ఏపీ మంత్రి పీతల

* ఏపీ మంత్రి సుజాత ఇంట్లో నోట్ల కట్టల కలకలం
* కుమార్తె ఉద్యోగం కోసం రూ.10 లక్షలిచ్చేందుకు వచ్చిన మహిళ
* మంత్రి తండ్రి  సొమ్ము తీసుకుంటుండగా సెల్‌లో చిత్రీకరణ
* ఆ విషయం గుర్తించి... కట్టలు బయటకు విసిరివేత

సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాబు వస్తే జాబు వస్తుందన్నారు. బాబు వచ్చి ఏడాదైనా నిరుద్యోగులకు జాబులు మాత్రం రాలేదు.వచ్చే ఒకటి రెండు సర్కారీ పోస్టులను తెలుగుదేశం నేతలు తెగనమ్ముకుంటున్నారు.

డీఎస్సీ ఉద్యోగం కోసం ఓ మహిళ రూ.10 లక్షల నగదు తీసుకుని మహిళా, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఇంటికి వెళ్లడం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడే డబ్బు కట్టలు వదిలివేసి వెళ్లడం టీడీపీ నేతల బరితెగింపునకు అద్దం పట్టింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఐదు కోట్లతో ఓ ఎమ్మెల్యే ఓటు కొనేందుకు ప్రయత్నించి జైలుపాలైన ఉదంతం మరవకముందే ఏపీ మంత్రి ఇంట్లో బయటపడ్డ నోట్లకట్టల వ్యవహారం తాజాగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే... సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పూర్వ ఉద్యోగి అర్దాల విష్ణువతి దత్తు కుమార్తె కార్నె శ్రీలక్ష్మి  తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించుకోవాలని విష్ణువతి సంకల్పించుకున్నారు. గతం లో ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సుజాతతో ఆమెకు స్నేహసంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ స్నేహంతోనే తమ దత్తు కుమార్తెకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పించాలని రూ.10 లక్షలకు మంత్రితో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి మంగళవారం రాత్రి  ఇంటికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో తండ్రి బాబ్జీకి ఈ డబ్బు వ్యవహారం అప్పగించినట్టు తెలుస్తోంది.

టీడీపీ ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యదర్శి కూడా అయిన బాబ్జీ తన కూతురి తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతుం టారు. ఒప్పందంమేరకు డబ్బు అందజేసేం దుకు విష్ణువతి మంగళవారం సాయంత్రం వీరవాసరంలోని మంత్రి నివాసానికి వచ్చారు. ఆమె డబ్బు అందజేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటుగా వీడియో తీసినట్టు మంత్రి తండ్రి గుర్తించారు. అంతే... వెంటనే ఆయన సీన్ మార్చేశారు. నోట్ల కట్టల సంచీని బయట పెట్టించి... మతిస్థిమితం లేని మహిళ డబ్బు సంచితో తన ఇంటి ఆవరణలోకి వస్తే ఏం చేస్తున్నారంటూ బందోబస్తు పోలీసులను, టీడీపీ కార్యకర్తలను దబాయించారు.  

పోలీసులకు ఫోన్ చేసి ఎవరో మతిస్థిమితం లేని మహి ళ డబ్బు కట్టలతో తమ ఇంట్లోకి వచ్చిందని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుని... తమ ఇంటి వాకిట్లో డబ్బు సంచి పడి ఉందని తమ వ్యక్తిగత సహాయకుడు చికిలే సుబ్బారావుతో ఫిర్యాదు ఇప్పిం చారు. రాత్రి పది గంటల సమయంలో ఇంటికి చేరుకున్న మంత్రి పీతల నేరుగా జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఫోన్‌చేసి విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. మంగళవారం పొద్దుపోయాక వెలుగుచూసిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

మరిన్ని వార్తలు