పోలీసులకు ముచ్చెమటలు

23 Sep, 2014 23:57 IST|Sakshi

సాక్షి, గుంటూరు
 ఇతర రాష్ట్రాల్లో ఏ సంఘటన జరిగినా దాని మూలాలు గుంటూరు జిల్లాలో ఉంటున్నాయి. భారీ చోరీలు, దోపిడీలు జరిగాయంటే ఆయా రాష్ట్రాల పోలీసులు ముందుగా గుంటూరు వైపు చూస్తుంటారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ చోరీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు ఆరా తీయగా, అది తాడేపల్లి దొంగల ముఠా పనేనని తేలింది.  తమిళనాడుకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇద్దరు ఎస్పీలు, పలువురు ఉన్నతాధికారులకు చెందిన ఖరీదైన సెల్‌ఫోన్లు, మహిళా అధికారుల బంగారు గాజులు, అమెరికన్ కరెన్సీ వంటివి చోరీకి గురయ్యాయని తెలియడంతో అంతా అవాక్కయ్యారు. వీఐపీల వస్తువులనే దొంగిలించిదెవరనే అనుమానాలూ తలెత్తాయి. చివరకు ఫోన్ నెట్‌వర్కింగ్ ద్వారా ఆరా తీస్తే తాడేపల్లికి చెందిన దొంగలుగా తేలింది.
 అసలేం జరిగిందంటే..
     తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఇషా యోగా సెంటర్‌కు నిత్యం ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు వస్తుంటారు. అక్కడికి వచ్చే ఎంతటి ప్రముఖులైనా వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, బంగారం, నగదు మొత్తం కేంద్రంలోని కౌంటర్‌లో ఉంచి లోపలకు వెళ్లి యోగా నేర్చుకోవాల్సి ందే.
     15 రోజుల క్రితం ఈ తతంగాన్ని గమనించిన దొంగలు ఇదే అదనుగా భావి ంచి కౌంటర్‌లో ఉన్న వ్యక్తిని ఏమార్చి సొత్తు దోచుకుని ఉడాయించారు.
     18 సెల్‌ఫోన్లు, బంగారు గాజులు, అమెరికన్ కరెన్సీతోపాటు కొంత డబ్బు కూడా చోరీకి గురైనట్లు గుర్తించిన ఉన్నతాధికారులంతా విషయం బయటకు పొక్కితే పరువుపోతుందని గోప్యంగా ఉంచారు.
     అపహరణకు గురైన సెల్‌ఫోన్ల నెట్‌వర్కింగ్ గుంటూరు జిల్లాలో చూపిస్తుండ టంతో తమిళనాడు పోలీసులు ఆంధ్రా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి విషయాన్ని వివరించారు. దీంతో అప్రమత్తమైన అడిషనల్ డీజీపీ, గుంటూరు రేంజి ఐజీ పీవీ సునీల్‌కుమార్, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలతో మాట్లాడి దొంగలను పట్టుకునేందుకు వ్యూహం రూపొందించారు.
 పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు..
     కోయంబత్తూర్ నుంచి వచ్చిన పోలీస్ బృందంతో కలసి గుంటూరు పోలీస్ బృందాలు పది రోజులుగా గాలింపు చేపట్టాయి.
     ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్‌ఫోన్లు, రెండు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని సమాచారం.
     వారి కోసం రాష్ట్రంలోని నగరి, చిత్తూరు, హైదరాబాద్, జిల్లాలోని తాడేపల్లి, కపట్రాళ్లతిప్ప ప్రాంతాల్లో రెండు పోలీసు బృందాలు గాలింపు చేస్తున్నాయి.
     తాడేపల్లికి చెందిన ఓ మహిళా దొంగ ఈ ముఠాకి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. వీరి వద్ద సొమ్ము రికవరీ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
     గతంలో కూడా అనేక దొంగతనాల కేసుల్లో రికవరీల కోసం వె ళ్లిన పోలీసు అధికారులకు వీరంతా ఎదురు తిరగడం, ఆత్మహత్యాయత్నాలు చేసి బెదిరించడం వీరికి అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
     ఈ సంఘటనలో చోరీకి గురైన సొత్తు ఉన్నతస్థాయి అధికారులకు చెందింది కావడంతో ఎలాగైనా రికవరీ చేయాలని గుంటూరు జిల్లా పోలీసులు తంటాలు పడుతున్నారు.




 

మరిన్ని వార్తలు