పిల్లలకు పునర్జన్మ

9 Nov, 2023 04:33 IST|Sakshi

జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైద్యం

వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సర్కారు అండ

మెరుగైన వైద్యం అవసరమున్న వారికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స

దుర్గావరప్రసాద్, ఆదిలక్ష్మి దంపతులది కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామం. ప్రసాద్‌ గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరి మూడేళ్ల కుమార్తె జాహ్నవికి పుట్టుకతోనే గుండెజబ్బు ఉంది. మూడేళ్లు పైబడ్డాక ఆపరేషన్‌ చేయడానికి వీలుంటుందని అప్పట్లో వైద్యులు చెప్పారు. ఇంతలో గత నెలలో తాళ్లరేవులో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. దీంతో ఆదిలక్ష్మి జాహ్నవిని ఆరోగ్య సురక్ష శిబిరానికి తీసుకెళ్లింది.

వైద్యులు కాకినాడ జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి(డీఈఐసీ) రిఫర్‌ చేశారు. 25న పాపను డీఈఐసీకి తీసుకుని వెళ్లగా పలు వైద్య పరీక్షల అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వెళ్లా­ల్సిందిగా సూచించి ప్రయాణ ఖర్చుల కోసం డబ్బులిచ్చారు. 29న పాపను హృదయాలయానికి తీసుకెళ్లగా ఈనెల 2న గుండెకు ఆపరే­షన్‌ను విజయవంతంగా నిర్వహించారు.

‘ఒక్క రూపాయి ఖర్చులే­కుండా ప్రభుత్వమే నా బిడ్డకు గుండె ఆపరేషన్‌ చేయించింది. ప్రస్తు­తం పాప ఆరోగ్యం బాగుంది. ఆస్పత్రికి రానుపోను డబ్బులు కూడా ఇచ్చారు. పాప విశ్రాంత సమయంలో భృతి కింద వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద కూడా సాయం ఖాతాలో జమవుతుందన్నారు. ఈ మేలును జన్మలో మరువలేం’.. అని ఆదిలక్ష్మి ఎంతో సంతోషంతో అంటోంది.  

నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన రైతు అనిల్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె మధుప్రియకు గ్రహణం మొర్రి సమస్య ఉండటంతో పుట్టిన వెంటనే తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధారించారు. పాప పెద్దయ్యాక ఆపరేషన్‌ చేయడానికి వీలుంటుందని చెప్పారు.

ప్రస్తుతం పాపకు మూడేళ్లు దాటాయి. దీంతో పాప గుండెకు ఆపరేషన్‌ చేయించాలని అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించింది. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వేలో పాప సమస్యను తల్లిదండ్రులు వివరించారు. దీంతో వైద్య శిబిరానికి హాజరు­కావాలని సిబ్బంది చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

ఇక్కడి నుంచి మధుప్రియను హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్‌ పూర్తయింది. ‘మా కోసమే ప్రభుత్వం ఆరోగ్య సురక్ష పెట్టిందా అనిపిస్తోంది. రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే మాకు ఆపరేషన్‌ చేయించడం స్థోమతకు మించిన అంశం’.. అని అనిల్‌ చెబుతున్నాడు. 

సాక్షి, అమరావతి: ..జాహ్నవి, మధుప్రియల తరహాలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల భవితకు సీఎం జగన్‌ ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పుట్టుకతో న్యూరల్‌ ట్యూబ్‌ లోపం, డౌన్స్‌ సిండ్రోమ్, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, వంకర పాదాలు, నడుం భాగం వృద్ధిలోపం, గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే చెవుడు, రెటినోపతి ఆఫ్‌ ప్రీ మెచ్యూరిటీ, మేథోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్‌ సహా ఇతర 30 రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను వైద్యశాఖ గుర్తిస్తోంది. వీరికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

7.12 లక్షల పీడియాట్రిక్‌ ఓపీలు..
గతనెల సెప్టెంబర్‌ 30 నుంచి మంగళవారం (ఈనెల ఆరో తేదీ) వరకూ రాష్ట్రవ్యాప్తంగా 12,138 సురక్ష శిబిరాలు నిర్వహించగా ఏకంగా 58.81 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ఇందులో 7,12,639 పీడియాట్రిక్‌ ఓపీలున్నాయి. వీటిలో 1,247 మంది పుట్టుకతో గుండె జబ్బులు, వినికిడి లోపం, గ్రహణం మొర్రి, ఇతర పెద్ద సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరినీ సురక్ష శిబిరంలోని వైద్యులు డీఐఈసీలకు రిఫర్‌ చేశారు. మిగిలిన చిన్నచిన్న సమస్యలున్న పిల్లలందరికీ శిబిరాల్లోనే వైద్యంచేసి, ఉచితంగా మందులు అందజేశారు.

మరోవైపు.. ప్రయాణ ఛార్జీలతో సహా మెరుగైన వైద్యం కోసం డీఐఈసీలకు రిఫర్‌ చేసిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్యం చేయిస్తోంది. అంతేకాక.. వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ప్రయాణ ఛార్జీల కింద రూ.500లను కూడా అందిస్తోంది. రూ.లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తున్నారు.

వినికిడి లోపం ఉన్న వారికి కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ చేయిస్తున్నారు. ఇలా.. ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన 1,247 మంది చిన్నారుల్లో 646 మందికి ఇప్పటికే చికిత్స పూర్తయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 165 మంది చిన్నారులను రిఫర్‌ చేయగా వంద శాతం పిల్లలకు చికిత్సలు నిర్వహించారు. 

పిల్లల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ అండ
ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల ఆరోగ్యాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వినికిడి లోపం ఉన్న చిన్నారుల రెండు చెవులకు బైలేటరల్‌ కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ చికిత్సను సీఎం జగన్‌ ఆరోగ్యశ్రీలో చేర్చారు.

రూ.12 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇక 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నాటికి వినికిడి లోపంతో బాధపడుతున్న 566 మంది చిన్నారులకు రూ.34 కోట్ల నిధులతో ప్రభుత్వం కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీలు నిర్వహించింది. గుండె జబ్బులున్న పిల్లల కోసమైతే సీఎం జగన్‌ తిరుపతిలో ప్రత్యేకంగా హృదయాలయం ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇప్పటివరకు రెండు వేల మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించారు.  

ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వైద్యసేవలు..
ఆరోగ్య సురక్ష ద్వారా రిఫరల్‌ కేసుల్లో సంబంధిత వ్యక్తులపై ఎలాంటి ఆర్థిక భారంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలు అందిస్తోంది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ప్రయాణ ఛార్జీల కింద రూ.500 చొప్పున కూడా అందిస్తోంది. రిఫరల్‌ కేసులపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. స్థానిక మెడికల్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది ద్వారా ప్రతి రిఫరల్‌ కేసును ఆస్పత్రికి తరలిస్తున్నాం. అక్కడ పూర్తి ఉచితంగా పరీక్షలు, చికిత్సలు, మందులు అందించేలా చూస్తున్నాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు