అధికార ‘లాఠీ’

26 Jul, 2018 13:02 IST|Sakshi

రాజకీయ చట్రంలో నాలుగో సింహం

అధికార పార్టీకి దాసోహం

వసూళ్లలో మునిగితేలుతున్న వైనం

ఖాకీకి ‘ పసుపు’ మరక అంటుకుంటోంది. అధికార పార్టీ నాయకులకు నాలుగో సింహం దాసోహవుతోంది. బాధితులు న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్ల మెట్లు ఎక్కడం మానేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్లో పొలిటికల్‌ పోస్టింగులు కావడంతో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు పోలీస్‌ అధికారులు అడ్డదారులు  తొక్కుతున్నారు. వసూళ్లలో మునిగితేలుతున్నారు. పుత్తూరు సబ్‌ డివిజన్‌లో పోలిసింగ్‌ రాంగ్‌ రూట్లో వెళుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్తూర్, పుత్తూరు: పుత్తూరు సబ్‌డివిజన్‌లో ‘చట్టం అధికార పార్టీకి చుట్టంగా’ మారిపోయింది. రాజకీయ ఛట్రంలో ఇరుక్కొని నాలుగో సింహం విలవిలాడుతోంది. అధికార పార్టీ నాయకులకు జీ హుజూర్‌ అనాల్సిన పరిస్థితి సబ్‌ డివిజన్‌లో నెలకొని ఉంది. ఫిర్యాదు స్వీకరణ నుంచి ఎఫ్‌ఐఆర్‌ నమోదు వరకు అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పనిచేయాలి. అలా కాకుండా విద్యుక్త ధర్నాన్ని నెరవేరిస్తే మాత్రం బదిలీని బహుమానంగా అందుకోవాల్సి ఉంటుంది. దీంతో డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు అధికారపార్టీ పంజరంలో చిలకలుగా మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు పోలీస్‌ అధికారులు అవినీతికి గేట్లు ఎత్తేశారు. వసూళ్లలో బిజీ అయిపోయారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

వసూళ్లలో బిజీబిజీ..
కార్వేటినగరం సర్కిల్‌ పరిధిలో పూడిపాముల సగ్మర్లకు ఫేమస్‌ అయిన మండలంలో ఎస్‌ఐ వసూళ్లు చూసి డిపార్ట్‌మెంటే నోరు వెళ్లబెడుతోంది. ప్రతి కేసుకు ఒక రేటు నిర్ణయించేశారు. క్రషర్లు, తమిళనాడు రేషన్‌ బియ్యం, ఇసుక నుంచి నెలవారీ మామూళ్లు అందాల్సిందే. పూడిపాముల స్మగ్లర్లు, సారా కేసులు, దొంగనోట్ల ముఠా అరెస్టుల్లో అందిన కాడికి దండుకోవడమే. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.. ఎవరు ఎక్కువ తడిపితే వారిదే న్యాయంగా తేల్చేస్తారు. వసూళ్లన్ని సీపీవోల ద్వారా జరపడం ఇక్కడ ఎస్‌ఐ స్టైల్‌.

ఇదే సర్కిల్‌ పరిధిలో భూ వివాదాలకు పేరుపడ్డ మండల ఎస్‌ఐది సప‘రేటు’. అదీ ఇదీ అని లేదు.. ఏదైనా సెటిల్మెంట్‌ చేసేయడమే. భూతగాదాలు, ప్రామిసరీ నోట్లు, డబ్బు లావాదేవీలు స్టేషన్‌ వేదికగా జరుగుతూ ఉంటుంది. తక్కెడ ఎటు వైపు బరువుగా ఉంటే అటు వైపు న్యాయం మొగ్గు చూపుతోందని ఈ స్టేషన్‌ గురించి ప్రచా రంలో ఉంది. క్రషర్లు ప్రధాన ఆదాయ వనరు.

ఇదే సర్కిల్‌లో మరో ఎస్‌ఐ ఫిర్యాదు దారులకు చుక్కలు చూపిస్తున్నారు. వినాయకచవితి గొడవలు, మహిళ మృతి కేసు, మహిళపై అత్యాచారం కేసుల్లో ఎక్కువగా ‘సంతృప్తి’ పరిచిన వర్గానికి న్యాయం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కుశస్థలీ నది మండల పరిధిలో ఉండడంతో  ఇసుక ట్రాక్టర్ల నుంచి బాగానే ఆందుతున్నట్లు సమాచారం.

అన్ని రకాల చట్టవ్యతిరేక కార్యక్రమాలకు నగరి సర్కిల్‌ అడ్డాగా మారుతోంది. ఇసుక, రేషన్‌బియ్యం, నకిలీ మద్యం, మట్కా, జూదం ఇక్కడున్న పోలీస్‌ బాస్‌కి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల టీడీపీ నాయకుడు ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్‌ను రూ. 75 వేలు విలువ చేసే గూగుల్‌ కంపెనీ మొబైల్‌ ఫోన్‌ గిఫ్ట్‌గా  కావాలని కోరారు. దీంతో అప్పటి నుంచి వెరీ కాస్ట్లీ బాస్‌గా పేరుగడించారు.

దాసోహం..
∙నగరి సర్కిల్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అంటే ఒంటి కాలిపై లేస్తారు. ఫక్తు టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. మంగళవారం బంద్‌ సందర్భంగా ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జులుం ప్రదర్శించడం తీవ్ర విమర్శలుకు దారితీసింది.

కార్వేటినగరం సర్కిల్‌ పరిధిలోని ఒక ఎస్‌ఐ అధికార పార్టీకి దాసోహమయ్యారు. ఇక్కడ బాధితులు స్టేషన్‌ మెట్లు ఎక్కడం మానేశారు. ఎమ్మెల్యే స్థాయి నాయకుడైనా సరే ప్రతిపక్ష పార్టీకి చెందన వ్యక్తి అయితే ఎస్‌ఐకి బాగా అలుసు. ఈయన వ్యవహార శైలిపై విమర్శలు చెలరేగుతున్నాయి.

పుత్తూరు సర్కిల్‌ పరిధిలోని బాగా మెతక అనే పేరున్న ఎస్‌ఐ తొలి నుంచి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాల్గొన్న ఒక కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన అల్లరిమూకలు నానా రభస చేశాయి. ఎస్‌ఐ మెతక వైఖరి కారణంగానే వారు రెచ్చిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ఈయన గారి మెతక వైఖరి కారణంగా పట్టణంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది.

బదిలీలే బహుమతి...
మరోవైపు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేయకుంటే బదిలీలతో సన్మానిస్తున్నారు.
పుత్తూరు సర్కిల్‌ పరిధిలోని పెద్ద ప్రాజెక్ట్‌ ఉన్న మండలానికి చెందిన ఎస్‌ఐ ఒకరు అధికార పార్టీకి చెందిన ‘మండల పెద్ద’ సమీప బంధువుల ఇసుక అక్రమ రవా ణాను అడ్డుకున్నారు. దీంతో ఊగిపోయిన ఆ మండల పెద్ద ఉన్నపళంగా ఎస్‌ఐను బదిలీ చేయించి ప్రతీకారం తీర్చుకున్నారు.
సత్యవేడు సర్కిల్‌ పరిధిలో ప్రముఖ వైష్ణవ ఆలయం ఉన్న మండలానికి చెందిన మరో ఎస్‌ఐ కూడా ఇసుక అక్రమ రవాణాలో దుకూడుగా వ్యవహరిస్తున్నారని రాత్రికి రాత్రే బదిలీ చేయించారు. ప్రముఖ ఆలయానికి చైర్మన్‌గా ఉన్న అధికార పార్టీ నాయకుడి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే ఆ ఎస్‌ఐ చేసిన పాపం.
సత్యేవేడు సర్కిల్‌ పరిధిలో మరో స్టేషన్‌ ఎస్‌ఐను అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారు. శ్రీసిటీ పరిధి ఎక్కువగా విస్తరించి ఉన్న ఈ మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి కొడుకు స్మగ్లింగ్‌లో ఆరితేరారు. ఈయన గారి ఆటలు సాగనివ్వకపోవడంతో సదరు ఎస్‌ఐపై ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖపై సమాజానికి నమ్మకం పోకముందుగానే ఉన్నతాధికారులు స్పందించి ప్రక్షాళన చేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు