ఠాణా.. సెటిల్‌మెంట్లకు అడ్డా!

7 Jun, 2018 12:48 IST|Sakshi
చెరువు వద్ద పోలీసుల హంగామా

సివిల్‌ పంచాయతీల వైపే  పోలీసుల మొగ్గు

వివాదాస్పదమవుతున్న పోలీసుల తీరు

బందరు తాలూకా స్టేషన్‌ పరిధిలో మితిమీరుతున్న వైనం

సాక్షి, మచిలీపట్నం : పోలీస్‌ అంటేనే భరోసా.. పోలీసు వ్యవస్థ అంటే బాధ్యత.. అంతకు మించి విశ్వాసం. సగటు మనిషికి పోలీసు స్నేహితుడిలా మెలగాలి. కానీ బందరు తాలూకా స్టేషన్‌ పరి ధిలో పరిస్థితి దీనికి విరుద్ధంగా నడుస్తోంది. వరుసగా జరుగుతున్న సెటిల్‌మెంట్లు వారి అవినీతికి అద్దం పడుతున్నాయి. వారి వ్యవహార శైలి వివా దాస్పదం అవుతుండటంతో ప్రజల్లో పోలీసు శాఖకే మాయని మచ్చలా మారుతోంది. ఇందుకు ఇటీవల బందరు తాలూకా స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటనలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన ఠాణాను అవినీతికి ఠికానాగా మార్చేస్తున్నారు. న్యాయం కోసం ఎవరు వెళ్లినా.. న్యాయం తమవైపు ఉన్నా పైసలు సమర్పించుకోవాల్సి వస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. క్రిమినల్, సివిల్‌ కేసులన్న బేధం లేకుండా వాటిలో కాలు పెట్టేస్తున్నారు. కాసుల కక్కుర్తితో న్యాయం చేయాల్సిన వారిని బెదిరించి మరీ సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిత్యకృత్యంగా మారాయి.

మచ్చుకు కొన్ని పరిశీలిస్తే...సివిల్‌ పంచాయతీల్లో హవా...
బందరు మండల పరిధిలోని తుమ్మలచెరువులో 20 మంది రైతులకు సంబంధించి 73.46 ఎకరాల రొయ్యల చెరువు ఉంది. సదరు రైతులు ఎనిమిదేళ్ల క్రితం సత్యనారాయణమూర్తి అనే వ్యక్తికి లీజ్‌ ఇచ్చారు. కొంత కాలం సాగు చేసుకున్న అనంతరం సత్యనారాయణమూర్తి మంగళగిరికి చెందిన శ్రీనివాసరావుకు అప్పజెప్పాడు. శ్రీనివాసరావు.. గాంధీ అనే వ్యక్తికి అప్పగించారు. గాంధీ చెరువు సాగు చేస్తుండగా.. బెంగళూరుకు చెందిన లక్ష్మీనరసింహన్‌ అనే ఆమె అకస్మాత్తుగా తెరపైకి వచ్చి చెరువు తనదేనంటూ హంగామా చేసింది. ఈ పంచాయతీ ఎస్పీ వద్దకు చేరింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది సివిల్‌ కేసైనా అందులో తల దూర్చి సెటిల్‌మెంట్‌కు దిగారు. చెరువుపై పూర్తి హక్కులు లక్ష్మీనరసింహన్‌కే ఉన్నాయంటూ గాంధీ వర్గీయులను బుధవారం బెదిరింపులకు గురి చేశారు.

ఏకంగా చెరువు వద్దకు వెళ్లి నానా హంగామా చేశారు. చెరువు వదిలి వెళ్లకపోతే తప్పుడు కేసులు బనాయిస్తామని హెచ్చరించారని బాధితుడు గాంధీ వాపోయాడు. లక్ష్మీనరసింహన్‌ నుంచి ముడుపులు తీసుకుని తనకు అన్యాయం చేస్తున్నారంటూ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక సివిల్‌ కేసులో అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం పోలీసులకు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం ఈ వ్యవహారమే కాదు జిల్లావ్యాప్తంగా ప్రతి నిత్యం ఇలాంటి సివిల్‌ సెటిల్‌మెంట్లతో జేబు నిండా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి తమకు సంపూర్ణ మద్దతు ఉండటంతో ఇలాంటి తంతుకు తెగబడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు