సత్తాచూపే సత్తెనపల్లి 

13 Mar, 2019 11:38 IST|Sakshi
సత్తెనపల్లి ఏరియల్‌ వ్యూ

సత్తెనపల్లి రూరల్‌ మండలం 24 పంచాయతీల్లో 31 గ్రామాలు

ముప్పాళ్ల మండలం 14 పంచాయతీల్లో 20 గ్రామాలు 

రాజుపాలెం మండలం 16 పంచాయతీల్లో 20 గ్రామాలు

నకరికల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామాలు 

సత్తెనపల్లి నియోజకవర్గం ..వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూనే వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపులకు కేంద్ర బిందువైంది. కళా రంగానికి జీవం పోసిన సత్తెనపల్లి గడ్డ.. సినీ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వంటి వారిని అందించింది. ఇక్కడ గెలిచిన పార్టీకే అధికార పీఠాన్ని కట్టబెడుతూ ఈ నియోజకవర్గం రాజకీయంగా ప్రసిద్ధి చెందింది. స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణకు నాలుగు పర్యాయాలు గెలిపించిన ఈ ప్రాంతం ప్రస్తుత రాజకీయ సమీకరణాలతో అందరి చూపూ తనవైపు తిప్పుకుంటోంది.

సాక్షి, సత్తెనపల్లి: నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంతోపాటు సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడ గుంటూరు–హైదరాబాద్‌ ప్రధాన రహదారి విస్తరించి ఉంది. భౌగోళికంగా 712 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నియోజకవర్గానికి దక్షిణాన నరసరావుపేట, ఉత్తరాన పెదకూరపాడు, పడమర గురజాల, తూర్పున తాడికొండ నియోజకవర్గం సరిహద్దులు కలిగి ఉన్నాయి. గ్రేడ్‌–2 మున్సిపాల్టీ అయిన సత్తెనపల్లి 30 వార్డులుగా విస్తరించి ఉంది.

నియోజకవర్గ విశిష్టత..
నియోజకవర్గం సాంస్కృతిక రంగానికి పెద్ద పీట వేసింది. ఇక్కడ కళా పరిషత్‌ల ద్వారా వేలాది నాటకాలు ప్రదర్శించారు. అతిమనోజ్ఞమైన చిత్రకళలో వర్ణ చిత్రాలు, ప్రకృతి చిత్రాలు, ఇకనోగ్రఫి(దేవతామూర్తి చిత్రాలు), భావోద్వేగ ఘట్టాలతో ఆలోచింపచేసే చిత్రాల సృష్టి కర్త జింకా రామారావు సత్తెనపల్లివాసే. ఆయన చిత్ర కళా ప్రదర్శన దేశ, విదేశ ప్రముఖుల, కళాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. సత్తెనపల్లి ప్రాంతం లలిత కళల పోషణకు ప్రసిద్ధి చెందింది.

రాష్ట్రంలోనే పేరుగాంచిన ఫణిదం చేనేత సహకార సంఘం ఇక్కడే నెలకొల్పారు. ప్రస్తుతం పత్తి ఆధారిత నాలుగు జిన్నింగ్, రెండు స్పిన్నింగ్‌ మిల్లుల్లో 2 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అనేక పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. నియోజకవర్గ పరిధిలో వరి, పత్తి, మిరప పంటలకు ప్రసిద్ధి. వర్షాధారంపైనే పంటలు సాగు చేస్తారు.

సాగర్‌ కుడికాలువ కింద వరి పంట సాగవుతోంది. రాజకీయంగానే కాక రైతులు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాలు సత్తెనపల్లిలోనే ఊపిరి పోసుకున్నాయి. నాగార్జున సాగర్‌ ఆనకట్ట నిర్మాణం కోసం 1950 ప్రాంతంలో 40 వేల మందితో సత్తెనపల్లిలో భారీ ఎత్తున జనసమీకరణ జరిగింది. ఆనకట్ట నిర్మాణం చేపట్టాలనే ఉద్యమానికి ఈ సమీకరణకు ఊతమిచ్చింది.  
 

ఏలికలు.. 
1952 నుంచి ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన ఘనత స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు దక్కింది. సత్తెనపల్లి నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గం ఏర్పడినప్పుడు స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి జే అంకమ్మపై 7348 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

1955లో సీపీఐ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బీ వందనంపై 868 ఓట్ల మెజార్టీ, 1962, 1967లో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వావిలాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం నరసింహారావుపై 4,675, 2443 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థి గాదె వీరాంజనేయశర్మ చేతిలో స్వతంత్ర అభ్యర్థి వావిలాల ఓటమి పాలయ్యారు.  

శర్మకు కేవలం 797 ఓట్ల మెజార్టీ మాత్రమే లభించింది. 1978లో కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థి డాక్టర్‌ రావెల వెంకట్రావు సీపీఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతిపై 9,369 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో టీడీపీ ఆవిర్భవించాక టీడీపీ అభ్యర్థి నన్నపనేని రాజకుమారి కాంగ్రెస్‌ అభ్యర్థి చేబ్రోలు హనుమయ్యపై 19, 668 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

1985లో సీపీఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతి కాంగ్రెస్‌ అభ్యర్థి జేవీ పద్మలతపై 9,351 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొడ్డా బాలకోటిరెడ్డి సీపీఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతిపై 13,928 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

1994లో సీపీఎం అభ్యర్థి పుతుంబాక భారతి ప్రత్యర్థి రాయపాటి శ్రీనివాస్‌పై 2,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో అప్పటి సీఎం చంద్రబాబు ధన రాజకీయాలకు తెర తీశారు. దీంతో నియోజకవర్గంలో ఎన్నికల స్వరూపమే మారిపోయింది.

అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామానికి చెందిన చిట్‌ఫండ్‌ వ్యాపారి వైవీ ఆంజనేయులుకు టీడీపీ టిక్కెట్‌ లభించింది. ఈ ఎన్నికల్లో ఆంజనేయులు   కాంగ్రెస్‌ అభ్యర్థి చేబ్రోలు హనుమయ్యపై 10,693 ఓట్ల మెజార్టీతో గెలిచారు.


వైఎస్‌ ప్రభంజనం..  
2004 ఎన్నికల ముందు వైఎస్‌ పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ కే అంజిరెడ్డికి 24,410 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతపం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఈ మెజార్టీ ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికల్లో అత్యధికంగా రికార్డుకెక్కింది. దివంగత నేత వైఎస్సార్‌  మార్కు అభివృద్ధితో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది.

సత్తెనపల్లిలో మంచినీటి చెరువు, పాలపాడు వద్ద లోలెవల్‌ చప్టాల స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జిల అభివృద్ధి పనులు చేపట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణకు  ఓటమి పాలయ్యారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై కేవలం 924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  ఆయన నియోజకవర్గం నుంచి తొలిసారి స్పీకర్‌ పదవి దక్కించుకున్నారు.

మార్పు– కూర్పు
పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న రాజుపాలెం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్ననకరికల్లు మండలాలను సత్తెనపల్లి నియోజకవర్గంలో కలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న ఫిరంగిపురం, మేడికొండూరు మండలాలను తాడికొండ నియోజకవర్గంలో కలిపారు.

సత్తెనపల్లి నియోజకవర్గం ఓటర్ల వివరాలు..

మొత్తం ఓటర్లు
 
పురుషులు  
 
మహిళలు 
 
ఇతరులు 
 
2,21,421  1,09,510  1,11,894  17  

మరిన్ని వార్తలు