మున్సిపల్ పరేషాన్

3 Mar, 2014 01:25 IST|Sakshi

సాధారణ ఎన్నికలకు ముందు ‘తలనొప్పి’పై పార్టీల ఆందోళన
విజయూవకాశాలపై ప్రభావం తప్పదంటున్న ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు
రెండు నెలలకు పైగా ప్రచారంతో అయ్యే అదనపు వ్యయంపైనా మల్లగుల్లాలు
 
 సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు రెండు మూడు రోజుల్లో షెడ్యూలు విడుదలయ్యే పరిస్థితుల్లో అర్థాంతరంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడటంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఊహించని తీరులో వచ్చిపడిన ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలలో తమ పార్టీ విజయావకాశాలపై ఏ ప్రభావం చూపుతాయోనని అన్ని ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలని ఆశిస్తున్న పార్టీల నాయకులు మున్సిపల్ ఎన్నికల వల్ల తమ జేబులకు ఎంత చిల్లు పడుతుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సోమవారం షెడ్యూలు విడుదలవుతుండటంతో పార్టీలు, రాజకీయ నాయకులు ఇప్పటికే తాము సిద్ధం చేసుకున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహాల్లో మార్పులు చేసుకోకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నమొన్నటి దాకా రాజకీయ పార్టీలు, ఆశావాహ అభ్యర్థులు ఏప్రిల్, మే నెలలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాలను ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర విభజన వంటి కారణాలతో పార్టీల పొత్తులు పూర్తిస్థాయిలో ఖరారు కాకపోయినప్పటికీ, ఎప్పుడు ఏ వ్యూహం అనుసరించాలన్న అంశంపై పూర్తి స్పష్టతతోనే ఉన్నారు. అరుుతే ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చారుు. 2009 సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగ నున్నారుు.

రాష్ట్ర విభజన ప్రక్రియతో ఇప్పటికే ఏ పార్టీ జాతకం ఎలా మారిపోతుందో తెలియని గందరగోళంలో ఉన్న పార్టీలు.. ఈ మున్సిపల్ ఎన్నికలు నెల తరువాత జరగబోయే సాధారణ ఎన్నికలలో తమ విజయావకాశాలపై తీవ్ర ప్రభావమే చూపించవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలతో మొదలయ్యే ప్రచారాన్ని సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు దాదాపు రెండు నెలలకుపైగా కొనసాగించడం తలకుమించిన భారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం, పోలీసులు, భద్రతా బలగాలు ఏకబిగిన మూడు నెలల పాటు ఎన్నికల విధుల్లో ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు