ఎడముఖం పెడముఖం

9 Aug, 2014 00:57 IST|Sakshi
ఎడముఖం పెడముఖం
  • బాబు సమక్షంలోనూ మారని మంత్రుల తీరు
  •  సీఎం పర్యటనలోనూ కొనసాగిన విభేదాలు
  • సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రడు,గంటాశ్రీనివాసరావుల విభేదాలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు పర్యటనలోనూ బయటపడ్డాయి. కలిసి పనిచేసుకోవాలని గతంలో చంద్రబాబు వీరిద్దరికి హితవు పలికినా.. తమ పద్ధతి ఇంతేనని చాటుకుంటున్నారు. సీఎం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దగ్గర నుంచి తొలిరోజు పర్యటన ముగిసేవరకు అక్కడక్కడా చిన్న పలకరింపు మినహా అసలు మాట్లాడుకోలేదు. చివరకు ప్రసంగించే వాహనంపైకి బాబు ఎక్కి మాట్లాడుతున్నా వెనుక ఇద్దరూ దూరందూరంగా నిల్చున్నారు.

    ఆ తర్వాత గంధవరంలో అయ్యనపాత్రుడు కాన్వాయ్‌ను వదిలి చోడవరం బహిరంగ సభ వద్దకు ముందుగానే వెళ్లిపోయారు. చాలామంది ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేయగా, వీరు మాత్రం విడివిడిగా తమ పని కానిచ్చారు. చోడవరం బహిరంగ సభ వేదికపైనా ఇద్దరూ వేర్వేరుగా కూర్చున్నారు. గంటా,వ్యవసాయ మంత్రి పుల్లారావు పక్కపక్కన కూర్చుని ఇద్దరూ అదేపనిగా మాట్లాడుకుంటే అయ్యన్న మౌనంగా కూర్చున్నారు.

    కనీసం బాబు సమక్షంలోనూ పలకరించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వాస్తవానికి సీఎం జిల్లా పర్యటన తొలుత ఖరారైనప్పుడు అధికారులు ఇద్దరు మంత్రులను సమీక్షకు ఆహ్వానించారు. దీనికి అయ్యన్న ముందుహాజరవ్వగా, గంటా ఆలస్యంగా వచ్చారు. దీంతో అయ్యన్న గంటాను ఉద్దేశించి ఎంత సేపు వెయిట్ చేయించావేంటి అని ఆగ్రహించారు.
     
    దీనికి గంటా కూడా గతంలో నువ్వుకూడా అలాగే చేశావు కదా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనకాపల్లిలో రాత్రి బస విషయంలోనూ ఇద్దరి మధ్య పంతాలు నడిచాయి. అనకాపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రి బస ఉండాలని గంటా పట్టుబట్టగా, అయ్యన్న మాత్రం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రలోనే బస ఉండాలని పట్టుబట్టి చివరకు మాట నెగ్గించుకున్నారు. చివరకు ఇలా సీఎం పర్యటనలోనూ ఇద్దరు దూరందూరంగానే ఉండడంతో జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఇద్దరిలో ఎవరిని ముందుగా పలకరించాలో తెలియక దూరంగా వెళ్లిపోయారు.
     

>
మరిన్ని వార్తలు