ఆన్‌లైన్‌ ‘దందా’

1 Jul, 2020 10:44 IST|Sakshi

అడ్డూ అదుపులేకుండా చదువుల వ్యాపారం

బిల్డింగ్‌ ఫండ్‌ ట్యూషన్‌ ఫీజు,పుస్తకాల పేరుతో దోపిడీ 

 ఆన్‌లైన్‌ క్లాసుల సాకుతో అదనపు బాదుడు 

పుస్తకాలకు తడిపి మోపెడు

నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్‌ స్కూళ్లు 

పాఠశాలలు తెరుచుకోలేదు..  తరగతులు నిర్వహించడం లేదు.. కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేదు. కానీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు వ్యవహరిస్తున్న తీరు కలవెరపెడుతోంది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీక్కుతింటున్నారు. ఫీజులు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ క్లాసులకు లింక్‌ ఇస్తామని ఊదరగొడుతున్నారు. పొనీలే అని ఫీజులు చెల్లించగానే పుస్తకాలను అంటగడుతున్నారు. వీటితోపాటు ట్యూషన్, యూనిఫాం ఇలా ఇతరత్ర వాటికి కూడా డబ్బులు చెల్లించాలంటున్నారు. విద్యా సంవత్సరంమే ప్రారంభంకాని నేపథ్యంలో ఈ అదనపు వసూళ్లపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

'సాక్షి, కడప ఎడ్యుకేషన్‌:  సాధారణంగా ప్రతి ఏటా విద్యా సంవత్సరం జూన్‌ నుంచి ప్రారంభం కావాలి. అయితే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల వారు నవంబర్‌ నుంచే అడ్మిషన్లు ప్రారంభించి ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా చాలా స్కూళ్లలో ఫిబ్రవరికి ముందే అడ్మిషన్లు జరిగిపోయాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 25 శాతంకు పైగా ఫీజులు పెంచారు. ఇంకా మోడల్, ఇంటర్నేషనల్, ఒలంపియడ్‌ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజులను వసూలు చేస్తున్నారు. వీటితోపాటు బిల్డింగ్, ట్యూషన్‌ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం ఇలా వివిధ పేర్లతో ఒక జాబితాను తయారు చేసి విద్యార్థుల తల్లితండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.   

ఆన్‌లైన్‌ తరగతులకు కూడా అవే ఫీజులు  
ప్రస్తుతం కరోనా కారణంగా విద్యా సంవతసరం ప్రారంభంకాలేదు. ఎప్పటి నుంచి తరగతులు ప్రారంభవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్, జూమ్‌ యాప్‌ ద్వారా తరగతులను నిర్వహిçస్తున్నారు. ఇందుకోసం కూడా ఏటా తీసుకునే విధంగా పీజులతో పాటు బిల్డింగ్‌ ఫీజు, ట్యూషన్‌ పీజులను వసూళ్లు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది కేవలం ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలని చెబుతున్నా ఇవేవి మాకు పట్టవన్నట్లు వారు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
  
నిబంధనలు పట్టించుకోకుండా..  
జిల్లాలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌  స్కూళ్ల నిర్వాహకులు ఒకవైపు ఫీజుల దోపిడీ, మరోవైపు పుస్తకాలు దందా సాగిస్తున్నారు. ఫీజుల విషయాన్ని పక్కనపెడితే ప్రభుత్వ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలన్ని నిబంధనలను కూడా తుంగలో తొక్కుతున్నారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన సొంత సిలబస్‌ పిల్లలపై దిద్దుతున్నారు.   
ఫీజుల కోసం తరచూ ఫోన్లు 
కరోనా ముమ్మరంగా ఉండి బయటకు రాలేని పరిíస్థితుల్లో కూడా మా పాఠశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని నిత్యం ఫోన్‌ మీద ఫోన్లు చేస్తున్నారు. దీంతోపాటు ఒకొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తే మీ పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేయడంతోపాటు ఆన్‌లైన్‌ తరగతులకు లింగ్‌ ఇస్తామన్నారు. డబ్బులు చెల్లించిన తరువాత లింగ్‌ ఇచ్చి పుస్తకాలు తీసుకెళ్లాలని లింక్‌ పెట్టారు. చేసేదేమి లేక 7వ తరగతి వాడికి రూ. 7,250,  9వ తరగతి వారికి రూ. 8,650 చెల్లించి పుస్తకాలను తెచ్చుకున్నాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.   – ప్రసాద్‌రెడ్డి, పేరెంట్, కడప 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు