ముంచుకొస్తున్న గడువు...!

20 May, 2014 02:26 IST|Sakshi
ముంచుకొస్తున్న గడువు...!

కొత్త పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయి. జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే అమలు అవుతుంది. అయితే ఈ నెల 26వ తేదీ నుంచే రెండు ప్రాంతాల్లో వేర్వేరు పరిపాలన సాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన పూర్తయింది. పాలనాపరమైన అంశాలైన ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ, ఇతర బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇన్నాళ్లూ ఎన్నికల విధుల్లో బిజీబిజీగా గడిపిన అధికారులు ఇప్పుడు విభజన హడావుడిలోనూ బిజీగా ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ పాలన స్తంభించింది.
 
 సాక్షి, కడప: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా లావాదేవీల హడావుడి మొదలైంది. జూన్ రెండున రాష్ట్రం వేరుపడనున్న నేపథ్యంలో ఓటాన్ బడ్జెట్‌తోనే మొదటి త్రైమాసిక ఖాతాలోకి నిధులు వచ్చేశాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చిన నిధులను ఆయా శాఖలు ఖర్చు చేసుకోవాలంటూ జీవో 86ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆగమేఘాలపై బిల్లులు వచ్చి పడుతున్నాయి. అయితే ఎన్నికల విధులతో బిజీబిజీ ఉన్న కొందరు అధికారులు బిల్లులు సమర్పించలేదు.
 
 ఈ నెల 24నే వేతనాలు చెల్లించేందుకు ప్రణాళికలు:
జిల్లాలో ఖజానాశాఖ పరిధిలో 26వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 80కోట్ల వేతనాలు ఇవ్వాలి. వీరితో పాటు పింఛనుదారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలాఖరున కొందరు పదవీవిరమణ చేయబోతున్నారు. వీరందరి...అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ గడువు విధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మొదటి త్రైమాసికం బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మే నెల ఉద్యోగుల వేతనాల బిల్లును సమర్పించేందుకు ఈ నెల 15వ తేదీ ఆఖరి గడువుగా విధించారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 19 వరకూ గడువు పెంచారు. రాష్ట్ర విభజన జూన్ 2న జరుగుతున్నందున జూన్ ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధించిన బిల్లులను కూడా ఉద్యోగులు ఇప్పటికే చెల్లించినా...ఇంకా కొంతమంది చెల్లించలేదు.. అయితే గడువు విషయం ఇప్పటి వరకూ చాలామందికి తెలీదు. ఎన్నికల విధినిర్వహణలో బిజీబిజీగా ఉండి చాలామంది బిల్లులు కూడా సిద్ధం చేసుకోలేదు. జీతాలు మినహా బిల్లులు చెల్లించడానికి 2 రోజుల గడువు పొడిగించారు.  
 
 విభజన హడావుడి:
అపాయింటెడ్ డేను జూన్2వ తేదీగా ప్రభుత్వం ప్రకటించినా...ఈ నెల 26వ తేదీ నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేరుగా పరిపాలన సాగనుంది. దీంతో ఉద్యోగుల విభజన నుంచి అన్ని రకాల ప్రక్రియలు 25లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల జీపీఎఫ్, పండుగ అడ్వాన్సుల బిల్లులను, కంటింజెంట్ బిల్లులను ఇప్పటికే చెల్లించేశారు. ఈ నెలాఖరున పదవీవిరమణ చేసే వారు కూడా ఈ నెల 24లోపే బిల్లులు సమర్పించాలి. గ్రాట్యూటీ, పదవీవిరమణ లబ్ధి నెలాఖరునే సంబంధిత లబ్ధిదారులకు అందజేస్తారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి బిల్లులను కూడా ఈ నెల 24వ తేదీలోగా సమర్పించాలి. ఓటాన్ బడ్జెట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రెండు నెలలకు సరిపడా నిధులను ఖజానాకు ప్రభుత్వం విడుదల చేసింది.
 
స్త్రీ శిశుసంక్షేమ శాఖలోని అన్ని రకాల బిల్లులను ఒకే ఖాతా కింద చెల్లింపునకు ప్రత్యేక అనుమతి లభించింది. ఐసీడీఎస్ పరిధిలోని పథకాలు, ఇతర బిల్లులకు చెల్లింపు ఎక్కడా ఆపకుండా ఇవ్వమని ఆదేశాలు ఉన్నాయి. ప్రణాళికా బిల్లులను కూడా ఒకే పద్దు కిందకు తెచ్చి వాటి చెల్లింపునకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆయా ఎన్నికల బిల్లులను కూడా ఈ నెల 24లోగా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత బిల్లులు వస్తాయో...రావో తెలీని పరిస్థితి ఉందని ఖజానా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
 
 గడువు పెంపుపై ఆదేశాలు రాలేదు - రంగప్ప, ట్రెజరీ డీడీ, కడప
 సోమవారం(19)తో బిల్లుల చెల్లింపునకు గడువు ముగిసింది. గడువు పెంపుపై ఇప్పటి వరకూ డెరైక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నెల 24నే వేతనాలు అందుతాయి. విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం.

మరిన్ని వార్తలు