నీళ్లకోసం ఘర్షణ

20 May, 2014 02:31 IST|Sakshi
నీళ్లకోసం ఘర్షణ
 •      కత్తులతో దాడులు
 •      నలుగురికి తీవ్ర గాయాలు
 •  మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: మంచినీళ్ల కోసం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నపాటి ఘర్షణ చినికిచినికి పెద్దది కావడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆది వారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది.  బాధితుల కథనం మేరకు..  రాత్రి పూట కరెంటు సరఫరా ఉండడంతో వేంపల్లెలో అర్ధరాత్రి మంచినీటి సరఫరా చేస్తున్నా రు.

  గ్రామానికి వేసిన పైపులైన్లలో ప్రధాన పైపులైను చెరువుకట్ట మీద నుంచి వెళుతోంది. ఆ పైపు పగిలిపోవడంతో గ్రామానికి సరిగ్గా నీళ్లు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామానికి చెందిన శ్రీనివాసులు(38), ఇతని కుమారుడు రాజశేఖర్(21) గమనించి నీరు వృథాకాకుండా పైపును తాడుతో గట్టిగా కట్టేశారు.  తెల్లవారే సరికి తిరిగి ఆ తాడు ను స్థానికంగా ఉంటున్న రమేష్ అతని కుమారుడు రాఘవేంద్ర తెంపేస్తున్నారు. ఇలా రెండు రోజులు చేశారు.

  ఎన్నిసార్లు పైపును కట్టినా తెంపేస్తుండడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆదివారం రాత్రి తిరిగి శ్రీనివాసులు, రాజశేఖర్, శ్రీనివాసులు అన్న నారాయణ (40), కుమారుడు చెన్నకేశవ(21) నలుగురు కలిసి నీటి సరఫరా జరిగే సమయంలో చెరువుకట్టమీదకు వెళ్లి నీటిపైపును తాడుతో బిగి స్తున్నారు. అక్కడికి వచ్చిన రమేష్, అతని కుమారుడు రాఘవేంద్ర, వీరి బంధువు నరేష్ అడ్డు తగిలారు. పైపును కట్టడానికి మీరెవరు.. సర్పంచ్‌ను పిలవండి అంటూ పరుష పదజాలంతో దూషించారు.

  ‘‘నీళ్లు వృథాగా పోతుంటే సర్పంచే రానక్కరలేదు.. ఎవరైనా సరిచేయవచ్చు’’ అంటూ వారు పైపును కడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ  పెద్దది కావడంతో పరస్పర దాడులకు పూనుకున్నారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రమేష్, రాఘవేంద్ర, నరేష్ పక్కనే ఉన్న కత్తులు, బాకులతో దాడులు చేశారు. బాధితుల అరుపులు కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు.

  తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, శ్రీనివాసులు, నారాయణ, చెన్నకేశవను 108 వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి గ్రామంలో జరిగిన సంఘటనపై విచారించారు. హత్యాయత్నానికి పాల్పడినట్టు విచారణ లో తేలడంతో నలుగురు నిందితులపై 326, 307, 324, 323 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు