సాహిత్యశీలి అస్తమయం

20 Jan, 2020 07:45 IST|Sakshi
హనుమారెడ్డి (పైల్‌) 

ప్రముఖ న్యాయవాది, ప్ర.ర.సం గౌరవాధ్యక్షుడు భీమనాథం హనుమారెడ్డి హఠాన్మరణం 

దిగ్భ్రాంతి చెందిన సాహిత్య లోకం  

పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ప్రముఖులు 

నేడు ఒంగోలులో అంత్యక్రియలు

సాక్షి, ఒంగోలు: ‘డియర్‌ మరణమా, ప్రియ నేస్తమా, నీ వయసెంతో కానీ, నువ్వొక నిశ్శబ్ధ మేధావివి, నీవే లేకపోతే, ఈ లోకం గతేంకాను? ఒక్క మాట చెప్పు. ఎప్పుడూ నా నీడలోనే నీవుంటావు. ఎందుకు మనకీ దోబూచులాట? ఎట్లైనా అంతిమ విజయం నీదేకదా!’ అంటూ మృత్యువుతో స్నేహం చేసిన ప్రముఖ న్యాయవాది, ప్రకాశం జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు బీమనాథం హనుమారెడ్డి(79) ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం రాష్ట్ర 9వ మహాసభల మూడో రోజున ఆయన మరణించడంతో సాహిత్య లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది.

ఈ నెల 17వ తేదీ నుంచి ఒంగోలు ఏకేవీకే కాలేజీ ప్రాంగణంలో మహాసభలు నిర్వహిస్తుండగా, చివరి రోజైన ఆదివారం ఆయన ముగింపు ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. పలువురు సాహిత్యవేత్తలను ఆయన సత్కరించాల్సి ఉంది. ఇంతలోనే హనుమారెడ్డి మృతి చెందారన్న వార్త విని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యవేత్తలు హతాశులయ్యారు. సభా ప్రాంగణం నుంచి ఒంగోలు వీఐపీ రోడ్డులోని హనుమారెడ్డి స్వగృహం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. హనుమారెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.   


రచయితల మహాసభ వేదికపై హనుమారెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు

నివాళులర్పించిన ప్రముఖులు 
రచయిత, న్యాయవాది హనుమారెడ్డి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖ సాహిత్యవేత్తలు, కవులు నివాళులర్పించారు. మహాసభల ప్రాంగణంలో నిర్వహించిన సంతాప సభలో, భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కేపీ కొండారెడ్డి, దారా సాంబయ్య, దామచర్ల జనార్దన్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరారెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్ర.ర.సం జిల్లా అధ్యక్షుడు పొన్నూరి వెంకటశ్రీనివాసులు, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, కవి సంధ్య శిఖామణి, చలపాక ప్రకాష్‌, డాక్టర్‌ సామల రమేష్‌బాబు, ఇడమకంటి లక్ష్మీరెడ్డి, గుత్తికొండ సుబ్బారావు, టి.అరుణ, డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్‌ నూనె అంకమ్మరావు, మల్లవరపు ప్రభాకరరావు, పి.శ్రీనివాస్‌ గౌడ్, శ్రీరామకవచం సాగర్, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పాలూరి శివప్రసాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు నివాళులర్పించారు. 


హనుమారెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న రచయితలు, శ్రేయోభిలాషులు

నేడు అంత్యక్రియలు 
హనుమారెడ్డి పార్థివదేహంతో సోమవారం ఉదయం 11 గంటలకు అంతిమ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, ప్ర.ర.సం జిల్లా అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కోశాధికారి యత్తపు కొండారెడ్డి తెలిపారు. ఒంగోలు వీఐపీ రోడ్డులోని హనుమారెడ్డి స్వగృహం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు.  
  
ఎంపీ మాగుంట సంతాపం 
న్యాయవాది, రచయిత హనుమారెడ్డి మృతి వార్త తనను ఎంతగానో కలచి వేసిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో ఏపీపీగా ప్రజలకు ఎనలేని సేవలు చేసిన హనుమారెడ్డి రచయితల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి మహాసభలు నిర్వహించడంలో విశేషంగా కృషి చేశారని తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలిచారని, న్యాయవాదులకు, రచయితలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.  

హనుమారెడ్డి నేపథ్యం..
1941 ఏప్రిల్‌లో అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో జన్మించిన హనుమారెడ్డి న్యాయవాదిగా పట్టా పొంది వడ్లమూడి గోపాలకృష్ణ, సుంకర దశరథరామిరెడ్డి వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించి 1970 నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఆరేళ్లపాటు సేవలందించారు. 1985లో ప్రకాశం జిల్లా లోక్‌ అదాలత్‌ కన్వినర్‌గా పనిచేశారు. 1999లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తెలుగు భాష, సాహిత్యాల వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. జిల్లా రచయితల సంఘానికి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చారు. గడిచిన 55 ఏళ్లుగా ఒంగోలులో ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌గా పేరుప్రఖ్యాతులు పొందారు. ఈ క్రమంలో డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు తర్వాత ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 ఏళ్లకు పైగా విశేషంగా సాహిత్య సేవ చేశారు. వెన్నెలపువ్వు, పల్లెకు దండం పెడతా, మావూరు మొలకెత్తింది, గుజ్జనగూళ్లు, వీక్షణం, వెన్నెల గీతం, పావని, వర్గకవి శ్రీశ్రీ , మహిళ, విద్యార్థి రాజ్యాంగం, రిజర్వేషన్లు, రెడ్డి వైభవం తదితర పుస్తకాలు 
రచించారు.

మరిన్ని వార్తలు