పన్ను పోటు

23 Jan, 2015 02:13 IST|Sakshi
పన్ను పోటు

ఆస్తిపన్ను పెంపునకు రంగంసిద్ధం
రూ.40 కోట్ల మేర భారం
వారంలో   అఖిలపక్ష సమావేశం
మంత్రి డెరైక్షన్..  మేయర్ యూక్షన్..

 
విజయవాడ సెంట్రల్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు రంగం సిద్ధమైంది. ఇంటి అద్దెల ఆధారంగా 50శాతం మేర పన్ను పెంచాలనే యోచనకు పాలకులు వచ్చేశారు. ఈ మేరకు నగరంలో సర్వే పూర్తిచేసినట్లు సమాచారం. దీనిద్వారా నగరపాలక సంస్థకు సుమారు రూ.40కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఏటా ఐదు శాతం చొప్పున పన్ను పెంచుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేయనున్న నేపథ్యంలో.. అంతకుముందే పన్ను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థలోని రాజకీయ పక్షాల ఫ్లోర్‌లీడర్లతో సమావేశం నిర్వహించిన మేయర్ కోనేరు శ్రీధర్.. నెలాఖరులోపు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మేధావులతోనూ చర్చించేందుకు సన్నద్ధమవుతున్నారు. మునిసిపల్ మంత్రి పి.నారాయణ డెరైక్షన్‌లోనే ఇదంతా జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక బాదుడే బాదుడు

 పేద, మధ్యతరగతి వర్గాలపై ఆస్తిపన్ను పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది. నగరాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరిగాయి. కార్పొరేషన్ పన్ను పెంచితే మరోమారు అద్దెల దరువు తప్పదనడంలో సందేహం లేదు. 2007లో గృహ సముదాయాల్ని మినహాయించి వ్యాపార, వాణిజ్య సంస్థలకు 50శాతం మేర పన్ను పెంచారు. ఏడేళ్లలో చెత్త, మంచినీరు, డ్రెరుునేజీ, పార్కింగ్, డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌లు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్ల నుంచి రూ.250 కోట్ల మేర పన్నుల మోత మోగించారు. కార్పొరేషన్‌లో టీడీపీ అధికారం చేపట్టాక డ్రెయినేజీ, నీటి చార్జీలను ఏడుశాతం పెంచారు. అదేమంటే.. స్పెషల్ అధికారుల పాలనలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని ప్రజల్ని మాయ చేశారు. ప్రస్తుతం ఆస్తిపన్ను రూపంలో రూ.74 కోట్లు వసూలవుతుండగా, తాజా పెంపు ద్వారా రూ.114 కోట్ల్ల ఆదాయం వస్తుందని పాలకపక్షం అంచనా వేస్తోంది.

అవినీతికి పెట్టి.. జనాన్ని కొట్టి..

 నగరంలోని రెండు డివిజన్లలో సర్వే చేస్రూ.74 లక్షల మేర అవకతవకలు బయటపడ్డాయి. మిగిలిన డివిజన్లలో సర్వే పూర్తిచేస్తే కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుందని గత మునిసిపల్ కమిషనర్ సి.హరికిరణ్ చెప్పారు. ఆయన బదిలీ నేపథ్యంలో సర్వే అటకెక్కింది. టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్ పీనలైజేషన్ అమలు చేస్తే దండిగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నది బహిరంగ రహస్యం. ప్రజారోగ్యశాఖతో పాటు కార్పొరేషన్ ప్రధాన విభాగాలపై దృష్టిపెడితే లెక్కలేనన్ని దుబారాను అరికట్టవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం పేరుతో ఇంజినీరింగ్ విభాగం కార్పొరేషన్‌ను గుల్ల చేసింది. పనులు పూర్తి చేయకుండానే నిధులు ఖర్చు చేసేశారు. దీనికి సంబంధించి ఆడిట్ పూర్తికాలేదు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకుంటే కోట్ల రూపాయలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్‌లో భారీగా అవినీతి జరిగిందని నగర టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో ఫిర్యాదుచేశారు. విచారణ కమిటీ వేస్తానని ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్రమాల లెక్క తేల్చలేని పాలకులు ప్రజలపై భారాల బండి మోపేందుకు మాత్రం సిద్ధమవ్వడం విమర్శలకు తావిస్తోంది.  
 

>
మరిన్ని వార్తలు