రొయ్యలకూ క్వారంటైన్‌!

6 Jun, 2020 03:37 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తితో క్వారంటైన్‌ అనేది విస్తృత వ్యాప్తిలోకి వచ్చింది. అయితే కరోనాకు ముందు నుంచే తల్లి రొయ్యల (బ్రూడర్‌)ను క్వారంటైన్‌లో ఉంచే విధానం ఉంది. ఆక్వా చెరువుల్లో వెనామీ రకం రొయ్యల పెంపకానికి హేచరీ నిర్వాహకులు విదేశాల నుంచి గుడ్లతో ఉన్న తల్లి రొయ్యల (బ్రూడర్ల)ను దిగుమతి చేసుకుంటారు. వాటికి వ్యాధుల నిర్ధారణకు వారం రోజులపాటు ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధుల్లేవని తేలాకే హేచరీలకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. దేశం మొత్తమ్మీద చెన్నైలో ఒకే ఒక్క ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ సెంటర్‌ ఉంది. హేచరీల యజమానులు దిగుమతి చేసుకున్న తల్లి రొయ్యలను ఈ కేంద్రంలోనే పరీక్షకు పంపుతారు.  

► అమెరికా, వియత్నాం, థాయిలాండ్‌ దేశాల నుంచి వ్యాధుల్లేని బ్రూడర్‌ రొయ్యలను దిగుమతి చేసుకోవడానికి మాత్రమే భారత ప్రభుత్వం రిజిస్టర్డ్‌ హేచరీలకు అనుమతించింది.  
► ఆ రొయ్యలకు వ్యాధులుంటే వాటి ద్వారా ప్రజలకు వైరస్‌ కారక జబ్బులు సంక్రమిస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ క్వారంటైన్‌ విధానాన్ని అమలుచేస్తోంది.  
► దేశంలో మొత్తం 500 హేచరీలుండగా ఒక్క ఏపీలోనే 391 ఉన్నాయి. గతేడాది దేశం మొత్తంమీద 8.05 లక్షల టన్నుల వెనామీ రొయ్యల ఉత్పత్తి జరగ్గా.. రాష్ట్రంలో 5.70 లక్షలుండటం (71 శాతం) విశేషం. ఇక్కడ 80 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలు సాగవుతున్నాయి.  
► రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా బంగారమ్మపాలెంలో ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ సెంట ర్‌ను ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. 2018 మార్చిలో శంకుస్థాపన చేశారు. స్థల సమస్యలు తలెత్తడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక భూసమస్యను పరిష్కరించింది.  
► ఇప్పుడు అక్కడ 30 ఎకరాల్లో రూ.35 కోట్లు వెచ్చించి ఈ క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. నెలాఖరుకల్లా టెండర్లు పిలుస్తామని మత్స్య శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు.   

చెన్నైలోని ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ 
► విదేశాల నుంచి దిగుమతి అయిన తల్లి రొయ్యలకు ఎప్పట్నుంచో కొనసాగుతున్న విధానం 
► వైరస్‌ లేదని తేలాకే హేచరీలకు..  
► విశాఖ జిల్లాలో త్వరలో ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ సెంటర్‌  

మరిన్ని వార్తలు