కలెక్టర్లకు త్రైమాసిక పరీక్షలు!

19 Jan, 2018 02:10 IST|Sakshi

కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న మాదిరిగానే ప్రతి మూడు నెలలకోమారు అధికారులు కూడా పనితీరును, ఫలితాలను సమీక్షించుకోవాలని సీఎం చంద్రబాబు  సూచించారు. సీఎం నివాస సముదాయంలో కొత్తగా నిర్మించిన గ్రీవెన్స్‌ హాలులో గురువారం ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సీఎం ఆదేశించారు.  అటవీ సంపదను మార్కెటింగ్‌ చేయడం ద్వారా వృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరామును ఆదేశించారు. 

అవసరమైతే సస్పెండ్‌ చేయండి...
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సకాలంలో ఖర్చు చేయలేకపోవడం, వినియోగ పత్రాలు సమర్పించకపోవడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు వచ్చిన కేంద్ర నిధులను 15 నెలలైనా ఖర్చు చేయకపోవడం దారుణం. అవసరమైతే బాధ్యులను సస్పెండ్‌ చేయండి. ఎవరి కోసమో రాష్ట్రం నష్టపోతుంటే చూస్తూ ఉంటున్నారా?..’ అని కొందరు విభాగాధిపతులను ఉద్దేశించి సీఎం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. కేంద్రనిధులు పొందేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో సమన్వయం చేసుకోవా లని సూచించారు. నిధుల వినియోగ పత్రాలు పెండింగ్‌లో పెట్టవద్దన్నారు.

మూడంచెల వ్యవస్థ రావాలి: సీఎం 
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడంచెల వ్యవస్థను తెచ్చేందుకు చొరవ చూపాలని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ను కోరారు.  

మరిన్ని వార్తలు