అమ్మబోతే అడవేనా..!

25 Mar, 2016 00:13 IST|Sakshi

 అమలాపురం : ‘సమన్వయ లోపం’ అన్న మాటకు తిరుగులేని ఉదాహరణ చెప్పమంటే.. ఏ మాత్రం తడుముకోకుండా చూపుడువేలును ప్రభుత్వ శాఖల వైపు చూపొచ్చు. అనేక సందర్భాల్లో కళ్లకు కట్టిన వాస్తవమే ఇప్పుడు మరోసారి రబీ దిగుబడి, కొనుగోళ్లకు సంబంధించి రుజువు కానుంది.
 
 వ్యవసాయ శాఖ రబీ ధాన్యం దిగుబడి అంచనా 15 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, పౌరసరఫరాల శాఖ దానిలో 65 శాతం కొనుగోలే లక్ష్యంగా పెట్టుకుంది. మారిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) లెవీ నిబంధనల కారణంగా రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని రాష్ర్ట ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే జిల్లా అధికార యంత్రాంగమే కొనుగోలు లక్ష్యానికి కోతపెట్టడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
 
 జిల్లాలో గోదావరి డెల్టాలో రబీ సాగు చివరి దశకు చేరుకుంది. నీటి ఎద్దడి వల్ల కొన్ని ప్రాంతాల్లో సాగు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మిగిలిన చోట్ల అంచనాలకు మించి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ చెబుతోంది. జిల్లావ్యాప్తంగా 3.75 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా, సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.
 
  అనపర్తి, ఆలమూరు సబ్ డివిజన్లలో నీటి ఎద్డడి లేని ప్రాంతాల్లో ఎకరాకు 48 నుంచి 50 బస్తాలు, కొన్ని ప్రాంతాల్లో 53 బస్తా దిగుబడి ఉంటుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. కోతలు మొదలయ్యే సమయం దగ్గర పడుతుండడంతో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించింది. గతంలో లాగే జిల్లాలో 284 కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 9.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
 
 అప్పట్లో తప్పుడు లెక్కలు!
 గత ఖరీఫ్‌లోనూ ప్రభుత్వం 284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా సుమారు 12.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు. వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసింది పదవ వంతు కూడా ఉండదు. పైగా ఖరీఫ్ దిగుబడి అప్పట్లో 12 లక్షల మెట్రిక్ టన్నులని అంచనా వేయగా వర్షాల వల్ల కోనసీమలో పెద్ద ఎత్తున పంట దెబ్బతిని దిగుబడి తక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంచనాలకు మించి కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పండిన పంటలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు తమ అవసరాల కోసం నిల్వ చేసుకుంటారు.
 
  మెట్ట ప్రాంత రైతుల్లో కొందరు ఖరీఫ్‌లో పండిం చిన ధాన్యాన్ని ఇప్పటికీ అమ్మలేదు. అయినా పండినదానికన్నా అదనంగా కొనుగోలు చేసినట్టు అధికారులు చూపడం అనుమానాలకు తావిస్తోంది. మిల్లర్ల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్రాల నిర్వాహకులు అదంతా రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు చూపారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పట్లో సాక్షి రూ.‘100 కోట్ల దందా’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
 
 అరుునకాడికే ఖరీఫ్ ధాన్యం అమ్మకం
 కొనుగోలులో మతలబుల వల్ల రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలుకు అడ్డగో లు నిబంధనలు పెడుతున్న ప్రభుత్వమే.. మి ల్లర్లు, ధాన్యం షావుకార్లు అడ్డదారిలో అమ్ముకోవడానికి మాత్రం గేట్లు బార్లా తెరిచింది. కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు త మ ధాన్యాన్ని అయినకాడికి బయట అమ్ముకుంటున్నారు. గత ఖ రీఫ్‌లో తడిసిన ధాన్యం బస్తా (75 కేజీలు)ను రూ.600కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
 
 నాణ్యమైన ధాన్యాన్ని సైతం బస్తా రూ.800కి అమ్మాల్సి వచ్చి రైతులు నష్టాలు చవిచూశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు లక్ష్యానికి కోత పెడితే ఇదే అదనుగా మిల్లర్లు, ధాన్యం షావుకార్లు  తమను ముంచేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు ఈసారై నా ప్రతి బస్తా కొనుగో లు చేస్తే లాభాలు కళ్లజూ స్తామంటున్నారు. లేకుం టే పంట పండినా మరోసారి దండగ తప్పదని కలవరపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు