రారా.. తేల్చుకుందాం!

19 Nov, 2013 06:13 IST|Sakshi
రారా.. తేల్చుకుందాం!

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి:  ప్రజాసమస్యలను చర్చించి పరిష్కారం చూపాల్సిన రచ్చబండ కార్యక్రమం నాయకుల కొట్లాటకు వేదికగా మారింది. తాము ప్రజలకు జవాబుదారిగా ఉండాలనే విషయాన్నే మరిచిపోయి బూతుపురాణం మొదలుపెట్టారు. ‘నీవెంత అంటే నీవెంత’ అంటూ ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. ‘రారా.. తేల్చుకుందాం!’ అని తొడగొడుతూ ఫ్యాక్షన్ సినిమా సీన్‌ను తలపించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారంతా నిశ్చేష్టులై వెనుదిరిగారు. సభావేదిక అరుపులు కేకలతో దద్దరిల్లింది. వెరసి ప్రజాప్రయోజన కార్యక్రమం రణరంగంగా మారింది.

సోమవారం మండల కేంద్రమైన నర్వలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాహాబాహీకి దిగారు. పత్రికల్లో రాయలేని భాష వాడుతూ ‘రారా తేల్చుకుందాం’ అంటూ ఒకరిపై మరొకరు గట్టిగా కేకలు వేయడంతో ప్రజలు అక్కడినుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ విడత రచ్చబండ కార్యక్రమంలో అధికారపార్టీ ఆమోదముద్రతో ముగ్గురు సభ్యులను ఎంపికచేసి వారు మాత్రమే వేదికపై కూర్చొనే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నర్వలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నియమించిన సభ్యులతో మాట్లాడించే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డిపై తిరగబడ్డారు.

అంతటితో ఆగకుండా నర్వలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు సమాచారం ఇవ్వడంతో ఆయన తన అనుచరులతో వేదిక వద్దకు వచ్చి నానా బీభత్సం సృష్టించారు. దీంతో అక్కడ కొద్దిసేపు యుద్ధవాతావరణ ఏర్పడింది. సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్, కుర్చీలు, చెప్పులు గాల్లో లేచాయి. దాదాపు గంటన్నర పాటు ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ దాడులకు తెగబడ్డారు. చేయిదాటే పరిస్థితి కనిపించడంతో ఆత్మకూరు సీఐ గోవర్దన్‌గిరి, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ ఇద్దరు నేతలు రాజకీయం చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంతో ప్రజలు అసహనం వ్యక్తంచేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 ఆత్మకూరులో అదేతీరు!
 అంతకుముందు ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభకు హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు పరస్పరం గొడవపడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. తోపులాటలో సాక్షాత్తు మక్తల్ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్రిసభ్య కమిటీ పేరుతో కాంగ్రెస్ తరఫున ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన పేర్లనే కమిటీ సభ్యులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ సభ్యులను వేదికపైకి పిలవాలని మాజీ ఎమ్మెల్యే తన వర్గీయులతో కలిసి పట్టుబట్టడంతో ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ససేమిరా అన్నారు.

తాను ప్రతిపాదించిన వారిపేర్లు ఏమయ్యాయని అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేతలు సూచించిన వారిని వేదికపైకి పిలిచేది లేదంటూ ఎమ్మెల్యే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ వర్గీయులు ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాలవారు ఘర్షణకు దిగారు.
 - అలాగే మాడ్గులలో త్రిసభ్య కమిటీ సభ్యులను మాత్రమే వేదికపైకి ఆహ్వానించి మిగిలిన సర్పంచ్‌లను పట్టించుకోకపోవడంతో పలువురు సర్పంచ్‌లు ఆగ్రహంతో ఊగిపోయారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను వేదికపైకి ఆహ్వానించాలంటూ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లుగౌడ్‌తో మిగిలిన వారు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీని రద్దుచేయాలని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసంచేశారు. అప్పటికే వేదికపై ఉన్న టీడీపీ ఎమ్మెల్యే జి. జైపాల్‌యాదవ్‌తో మిగిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఉన్నా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు.

>
మరిన్ని వార్తలు