దొరికిన రేడియోధార్మిక మూలకం సీఎస్‌–137

24 Jan, 2019 08:07 IST|Sakshi
పాత ఇనుప సామగ్రి దుకాణంలో లభ్యమైన రేడియోధార్మికమూలం సీఎస్‌–137

కృష్ణాజిల్లా కలిదిండిలో పాత ఇనుపసామగ్రి దుకాణంలో లభ్యం

వివరాలను వెల్లడించిన అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమూషీబాజ్‌పాయ్‌

‘‘అమ్మో! రేడియోధార్మిక మూలకం సీఎస్‌ –137 కనిపించడం లేదు. రాజమహేంద్రవరం బేస్‌ కాంప్లెక్స్‌ నుంచి కనిపించకుండా పోయింది. దాని వల్ల చాలా ప్రమాదం’’ అని అమలాపురం ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు ఒక వైపు, ‘‘అవును ఆయన చెప్పింది నిజమే కానీ.. అంత ప్రమాదమేమీ కాదు’’ అంటూ ఓఎన్‌జీసీ అసెట్‌ మేనేజర్‌ శేఖర్‌.. ఇలా విరుద్ధ ప్రకటనలు చేశారు. గత నాలుగైదు రోజులుగా ఈ రేడియోధార్మిక మూలకం చోరీ ఘటనపై రకరకాల వదంతులు కూడా వ్యాపించాయి. మరోవైపు ఇదెక్కడికి పోయింది? ఎవరు ఎత్తుకెళ్లారనే విషయంపైనా ఓఎన్‌జీసీ అధికారులు తమ శక్తి వంచన లేకుండా వెతికారు. అయితే ఎట్టకేలకు దాని ఆచూకీ గుర్తించారు. ఆ వివరాలను అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమూషీ బాజ్‌పాయ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.

తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్‌: ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం బేస్‌ కాంప్లెక్స్‌లో లాగింగ్‌ యూనిట్‌ నుంచి కనిపించకుండా పోయిన రేడియో ధార్మిక మూలకం సీఎస్‌–137 కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలోని పాత ఇనుప సామాగ్రి దుకాణంలో లభ్యమైందని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమూషీబాజ్‌పేయ్‌ వెల్లడించారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేడియో ధార్మిక మూలం సీఎస్‌–137 దొరికిన విషయాలను వెల్లడించారు. ఈ నెల 17న ఓఎన్‌జీసీలో బేస్‌ కాంప్లెక్స్‌లో లాగింగ్‌ యూనిట్‌ నుంచి రేడియో ధార్మిక మూలకం సీఎస్‌–137 కనిపించకుండా పోయిందని సంస్థలోని అధికారి ఇ.పాపారావు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నెల 12న రాజమహేంద్రవరం బేస్‌ కాంప్లెక్స్‌ నుంచి కృష్ణా జిల్లా మల్లేశ్వరానికి తీసుకుÐð వెళ్లి తిరిగి ఈ నెల 14న బేస్‌ కాంప్లెక్స్‌లో వాహనాన్ని డ్రైవర్‌ పెట్టి వెళ్లిపోయాడన్నారు.

ఈ నెల16న రేడియో ధార్మిక మూలకం సిఎస్‌–137 కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పోలీసులను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడంతోపాటు, ఓఎన్‌జీసి సంబంధిత అధికారులతో కలిసి తీవ్రంగా శోధించామన్నారు. ఈ మూలకం వల్ల భారీ ప్రమాదం ముంచుకొస్తుందని వదంతలు రావడంతో దానికోసం పోలీసు బృందాలు అన్ని కోణాలలోను దర్యాప్తు చేశారన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీం సభ్యులు సహకారంతో ఓఎన్‌జీసీ అధికారులు సహకారంతో ఎప్పటికప్పుడు సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళ్లామన్నారు. చివరకు బుధవారం మ«ధ్యాహ్నం నాలుగు గంటలకు కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో పాత ఇనుప సామగ్రి దుకాణంలో సీఎస్‌–137 లభ్యమైందన్నారు. దీని వెనుక ఎవరున్నదీ విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఇన్‌స్పెక్టర్లు వరప్రసాద్, మురళీకృష్ణా రెడ్డి, ముక్తేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి రేడియోధార్మిక మూలకాన్ని గుర్తించామన్నారు. ఈ వస్తువును ప్రత్యేకమైన వాహనంలో అతి జాగ్రత్తగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్బన్‌ క్రైం ఏఎస్పీ వైవీ రమణారావు, తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు, ఇన్‌స్పెక్టర్లు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు