'అందుకే సీఎం కుర్చీలో బాలకృష్ణ కూర్చున్నాడు'

25 Jan, 2018 13:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్‌ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎన్నికోట్ల పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు ఏమోగానీ దోచుకున్నది.. దాచుకోవడానికి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.

బాబు హయాంలో గిరిజనులు, దళితులు, మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. మరోవైపు ఇరు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను పొగడటమే పనిగా పెట్టుకున్నారని రఘువీరా ఆరోపించారు. ఇరు రాష్ట్రాలను పక్షపాతం లేకుండా చూసే బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు.

బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు..
కాగా, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించిన అంశంపై రఘువీరా స్పందించారు. 'తన తండ్రి ఎన్టీఆర్‌ కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని బాలకృష్ణ మనస్సులో ఉండి ఉండొచ్చు.. అందుకే సీఎం రాష్ట్రంలో లేనప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు. సీఎం సీట్లో కూర్చుని బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు' అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు