రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి

28 Dec, 2014 02:31 IST|Sakshi

వెంకటగిరి టౌన్: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వేపరమైన సమస్యలను ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. రైల్వే సమస్యలపై వెంకటగిరిలో శనివారం ఆయన స్థానికులతో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రైల్వే జీఎం పర్యటనకు హాజరుకాలేకపోయానన్నారు. ప్రజల నుంచి సమస్యల వివరాలు సేకరించి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైల్వే మంత్రితో చర్చిస్తాన్నారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. శేషాద్రి, శబరి ఎక్స్‌ప్రెస్‌లను వెంకటగిరిలో నిలిపేలా చూడాలన్నారు. నిమ్మ ఎగుమతుల నేపథ్యంలో హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక బోగీ ఏర్పాటు చేయాలని, యాతలూరు రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైళ్లను నిలపాలని కోరారు.
 
 బుసపాళెం వద్ద రైల్వే క్రాసింగ్‌ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వెంకటగిరి- నాయుడుపేట మార్గంలో రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుపతి నుంచి షిరిడీకి రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని సాయిభక్తులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ వరప్రసాద్‌రావు స్థానిక రైల్వేస్టేషన్ మాస్టర్ శేషగిరిరావుతో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన వినతులపై చర్చించారు.  వీటిలో కొన్ని సమస్యలను ఇటీవల రైల్వే జీఎం శ్రీవాత్సవ దృష్టికి తీసుకెళ్లామని స్టేషన్ మేనేజర్ వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఆవుల గిరియాదవ్, నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, చిట్టేటి హరికృష్ణ, మధు, సాయినాయుడు, కె రాజారెడ్డి, తిరుమల పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు