సేమియా.. మజా లియా..!

14 Jun, 2018 12:51 IST|Sakshi
వన్‌టౌన్‌లోని ఒక ఇంటి ముందు ఆరబెట్టిన సేమియా

రంజాన్‌కు ప్రత్యేకం సేమియా

వన్‌టౌన్‌లో పలు సేమియా తయారీ కేంద్రాలు

మతసామరస్యానికి ప్రతీకగా సేమియా పంపిణీ

రంజాన్‌ మాసం.. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. దీక్షతో ఉపవాసముంటూ అల్లాను స్మరిస్తూ, దైవచింతనలో ఉంటారు. ఈమాసం అందరికీ ఆనందదాయకమే.. ఈనెలలోనే ప్రత్యేకంగా తయారు చేసే వేడివేడి రుచికరమైన హలీంను ఉపవాస విరమణ అనంతరం సాయంత్రం సమయంలో ముస్లిం మిత్రులతో కలిసి అందరూ ఆస్వాదిస్తారు. అయితే హలీంతో పాటు సేమియాకు ఈ మాసంలో విశిష్ట స్థానం ఉంది. రంజాన్‌ పర్వదినాన తమ చుట్టుపక్కల వారికి కులమతాలకు అతీతంగా సేమియాతో తయారు చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేసి ముస్లింలు  సోదరభావాన్ని చాటుకుంటారు...

వన్‌టౌన్‌: ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే తీపి వంటకం ఖీర్‌ఖుర్మా. రంజాన్‌ పర్వదినం రోజున ప్రతి ముస్లిం ఇంట సేమియాతో చేసే ఈ వంటకం తప్పనిసరి.  పండుగ రోజన ముస్లింలు తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు సేమియాతో చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేస్తారు. అంతేకాకుండా తమ దగ్గర ఆత్మీయులకు రంజాన్‌ సందర్భంగా సేమియాను అందజేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. అందుకోసం పండుగ సమీపిస్తున్న వారం పది రోజులు ముందుగానే సేమియా తయారీకు సన్నద్ధమవుతుంటారు.అందులో భాగంగానే ఒకొక్కరి ఇంటæ కనీసం ఐదు నుంచి పది కిలోల మేర సేమియాను తయారు చేయిస్తుంటారు.

వన్‌టౌన్‌లో సేమియా తయారీ కేంద్రాలు
వన్‌టౌన్‌లోని సేమియా తయారీ కేంద్రాలు ఏడెనిమిది వరకూ ఉన్నాయి. రంజాన్‌ మాసంలో ఆ సేమియా తయారీ కేంద్రాలన్ని ఉదయం నుంచి రాత్రి వరకూ బిజీబిజీగా దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది ఇళ్ల వద్ద సేమియా తయారీ యంత్రాలు కూడా ఉండటంతో వారే స్వయంగా తయారు చేస్తుంటారు.

స్వయం తయారీకే ప్రాధాన్యం..
గోధుమలను శుభ్రం చేసి పిండి ఆడించి పిండిని సిద్ధం చేసుకుంటారు. తిరిగి దానిని శుభ్రపరచి సేమియా తయారీ కేంద్రానికి చేరుస్తారు. అక్కడ తయారీ చేసే సిబ్బంది ఆ పిండిని యంత్రంలో వేసి సేమియాను తీస్తారు. తరువాత తయారైన సేమియాను ఆరుబయట గాలి ఆడేవిధంగా ఆరబెడతారు. ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకవైపు ఆధునికత వైపు పరుగులు తీస్తూ సంప్రదాయాలను పక్కనపెడుతున్న ప్రస్తుత కాలంలో ఇంకా సేమియా స్వయం తయారీకే ముస్లింలు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. బయట రకరకాల సేమియాలు విభిన్న రుచుల్లో అందుబాటులో ఉన్నా వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా కొద్దిమంది మాత్రమే అటుగా అడుగులు వేస్తారు.

ఖీర్‌ఖుర్మా పంపిణీతో సోదరభావం..
సాధారణంగా పండుగ రోజున ముస్లింలు ఖీర్‌ఖుర్మాను తయారు చేస్తారు. దానిని చుట్టుపక్కల మిత్రులకు, ఇతర బంధువులకు పంపిణీ చేస్తారు. ఖీర్‌ఖుర్మాను పంపిణీ చేయటం ద్వారా రంజాన్‌ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం తమ బంధువులకే కాకుండా చుట్టుపక్కల వారికి పంపిణీ చేసి తమ ఆత్మీయతను చాటుకుంటారు. ఖీర్‌ఖుర్మాతో పాటుగా సేమియాతో అనేక వంటకాలు చేసి తమ మిత్రులకు అందజేసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. సాధారణంగా వన్‌టౌన్‌లో ముస్లింలు తమకు ఆత్మీయులైన హిందువులకు తప్పనిసరిగా ఈ వంటకాన్ని లేదా సేమియాను అందజేయడం అనేక దశాబ్ధాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. మతసామరస్యానికి ఇటువంటి ఆత్మీయ పలకరింపులు వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటారు ఇక్కడి స్థానికులు. సేమియా కూడా మతసామరస్యానికి ఒక సాధనంగా రూపుదాల్చడం ఒక విశేషం.

మరిన్ని వార్తలు