రియల్టర్ల దందా!

1 Sep, 2013 02:37 IST|Sakshi
భోగాపురం, న్యూస్‌లైన్ : మండలంలో రియల్టర్ల దందా కొనసాగుతోంది. జాతీయ రహదారి పక్కన భూముల ధరలకు రెక్కలు వస్తుండడంతో రియల్టర్లు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో వారు తమ దందాను కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో మరోమారు వారి అడ్డగోలు భాగోతం వెలుగుచూసింది. మండలంలోని సవరవిల్లి గ్రామం.. రావాడ రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దయ్యాలబంద (బూసవాని చెరువు) ఆక్రమణకు గురైంది. చెరువు వెనుకన ఒక రియల్టరు గతంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అందులో ప్లాట్లు వేస్తున్నాడు. అయితే ఆ ప్లాట్లకు వుడా అనుమతి లభించాలంటే 60 అడుగుల రహదారి తప్పనిసరి. 
 
అయితే సుమారు 15 అడుగుల దారి మాత్రమే ఉండడంతో దారి పక్కన ఉన్న చెరువుగట్టును ఆక్రమించేందుకు సిద్ధపడ్డాడు. ఇంకేముంది రెవెన్యూ అధికారులు, రావాడ గ్రామంలోని మరికొంద మంది పెద్దలతో కలిసి ఆక్రమణకు దిగాడు. చెరువు గట్టు పొడుగునా సుమారు 300 మీటర్లు(సుమారు 2 ఎకరాలు) అతని రోడ్డుకు కలిపేసుకున్నాడు. చెరువు గట్టుపై ఉన్న సుమారు 70 తాటి చెట్లను నరికి తరలించాడు. ఇదంతా శుక్రవారం రాత్రికి రాత్రే యంత్రాలతో చేసేశాడు. శనివారం ఉదయం ఇదంతా చూసిన రైతులు, గీత కార్మికులు తమ చెరువు గట్టు కనిపించకపోవడంతో అక్కడ పని చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. అప్పటికే చెరువు గట్టు పూర్తిగా తీసేసి, తాటి చెట్లను కూడా తొలగించేశారు.
 
చెరువు గర్భం 11 ఎకరాల 40 సెంట్లు ఉండగా.. దీని ఆధారంగా పల్లం భూములు సుమారు 10 ఎకరాలు ఉన్నాయి. అయితే చెరువు నుంచి ఆయా పొలాలకు నీరు వెళ్లే మదుమును కూడా పూర్తిగా కప్పేశారు. దీనిపై అక్కడ ఉన్న సిబ్బందిని రైతులు, గీత కార్మికులు ప్రశ్నించగా తమకేమీ తెలియదని, రియల్టరు సూచనల మేరకు పని చేస్తున్నామని సమాధానం చెప్పడంతో వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే రావాడ గ్రామంలో ఉన్న మాజీ ఉప సర్పంచ్ దంతులురి సూర్యనారాయణరాజు, సర్పంచ్ నిడుగొట్టు పైడయ్య, ఉపసర్పంచ్ అప్పురభుక్త పైడినాయుడు తదితరులను ఆశ్రయించారు. అయితే వారంతా సంబంధిత రియల్టరును ఫోనులో సంప్రదించినా అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వారంతా సదరు స్థలంలో టెంటులు వేసి బైఠాయించారు. యంత్రాలను కదలనిచ్చేది లేదని చెప్పారు.
 
సమ్మెలో ఉన్నామన్న రెవెన్యూ అధికారులు..
దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తే.. సమ్మెలో ఉన్న కారణంగా తమకు సంబంధం లేదని అటు నుంచి సమాధానం వచ్చింది. అయితే రియల్టరు వద్ద పెద్దమొత్తంలో లంచాలు తీసుకున్న రెవెన్యూ అధికారులు సమైక్యాంద్ర సమ్మె అంటూ తప్పుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాటి చెట్లను అక్రమంగా నరికివేయడంతో ఉపాధి కోల్పోయామని గీత కార్మికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. రైతుల పొట్ట కొడుతున్న సంబంధిత రియల్టరుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు దువ్వు బంగారి, దువ్వు రాము, అప్పల చిన్నయ్య, దువ్వు ఆదినారాయణ, నాగరాజు, పైడిరాజు కోరుతున్నారు. 
 
మరిన్ని వార్తలు