నేషనల్‌ హైవేపై నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. కేవలం రెండు గంటల్లోనే..

8 Sep, 2023 10:29 IST|Sakshi

బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేపై గడ్కరీ కీలక ‍వ్యాఖ్యలు

ఆరు గంటల నుంచి రెండు గంటలకు ప్రయాణం

ఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.  బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు 2023 చివరిలో లేదా 2024 జనవరి నాటికి ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీంతో, రెండు మెట్రోపాలిటన్ నగరాల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని స్పష్టం చేశారు.

వివరాల ప్రకారం.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అశోక్ లేలాండ్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. చెన్నైలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాను. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించబడుతుంది. ఈ ప్రాంతాల్లో లగ్జరీ బస్సులు, స్లీపర్ కోచ్‌లను ప్రారంభించుకోవచ్చు. ఎన్డీయే హయాంలో ఢిల్లీ నుంచి చెన్నై నుంచి సూరత్, నాసిక్, అహ్మద్ నగర్, కర్నూలు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, యాక్సెస్ – నియంత్రిత హైవే ప్రాజెక్టు ద్వారా కలుపుతున్నామని అన్నారు. 

కేవలం రెండు గంటలే సమయం..
బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది. 2022 మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. దీని పొడవు 262 కిలో మీటర్లు ఉంటుంది. రూ. 14,870 కోట్లకుపైగా వ్యయంతో దీని నిర్మాణం కొనసాగుతుంది. ఈ హైవే పూర్తి అయితే కేవలం రెండు గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకు చెన్నై నుంచి బెంగళూరుకు రాకపోకలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించాలంటే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది.

ఇది కూడా చదవండి: ‘ఇండియా దటీజ్‌ భారత్‌’.. వెనుక ఇంత జరిగిందా?

మరిన్ని వార్తలు