గాలిలో దీపాలు

16 Jul, 2016 02:29 IST|Sakshi
గాలిలో దీపాలు

కూలిన బతుకులు.. కోలుకోని మత్స్యకారులు
చేపలతిమ్మాపురంలో దయనీయ దృశ్యాలు

 
తగరపువలస: భీమిలి మండలం చేపలతిమ్మాపురంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు 24 గంటలు గడచినా ఇంకా కోలుకోలేదు. బిక్కుబిక్కుమంటూ కొండపై కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం ఉదయం సమాచారం లేకుండా అధికారులు పిల్లలు, మహిళలను నిర్ధాక్షిణ్యంగా బయటకు ఈడ్చుకువచ్చారని ఆరోపిస్తున్నారు. వస్తువులేవీ బయటకు తీసుకోనీయకుండా జులుం ప్రదర్శించారన్నారు. శుక్రవారం పలుచోట్ల మహిళలు శిథిలాలకింద వంటపాత్రలు, ఆహారధాన్యాలు, పుస్తకాలు, దుప్పట్లు తదితర వస్తువుల కోసం వెతుకులాట ప్రారంభించారు. తమను ఆదుకునేవారికోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. గురువారం రాత్రంగా చిమ్మచీకటిలోనే కొండపై గడిపారు. గాలికి దీపాలు ఆరిపోతుండటంతో చీకట్లో చెట్లు, టెంట్ల కింద ఉన్నవారిని తేళ్లు కాటువేశాయి. వెలుతురు కోసం కనీసం టార్చ్‌లైట్లు కూడా వీరి వద్ద లేవు. ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరు రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు అప్పులు చేసి ఖర్చు చేసినా నేలమట్టం కావడంతో ఉసూరుమంటున్నారు.


ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు ఎండైనా, వానైనా కొండ దిగేదిలేదని తేల్చిచెబుతున్నారు. పుస్తకాలు శిథిలాలలో కలిసిపోవడంతో చిన్నారులు శుక్రవారం పాఠశాలలకు వెళ్లలేకపోయారు. 30 గంటలుగా ఎవరూ వంట చేసుకోలేదు. తెలిసినవారు ఆహారం పంపడంతో శుక్రవారం ఎంగిలిపడ్డారు. తమ ఇళ్ల కూల్చివేతలో పోలీసులు మానవత్వంతో వ్యవహరించినా అధికారపక్షం ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది తమపట్ల కఠినంగా వ్యవహరించారని మత్స్యకార మహిళలు వాపోయారు. ఇంత జరిగినా తమను పరామర్శించడానికి అధికార పార్టీకి చెందిన నాయకులెవరూ రాలేదని వాపోయారు.
 
 

>
మరిన్ని వార్తలు