ఢిల్లీలో కేసీఆర్‌ అధికారిక నివాసం ఖాళీ

5 Dec, 2023 01:26 IST|Sakshi

రెండు దశాబ్దాలుగా ఆ ఇంటితో అనుబంధం 

2, 3 రోజుల్లో పూర్తిగా తెగిపోనున్న బంధం 

ఎంపీగా, సీఎంగా ఇదే బంగ్లాలో బస 

సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలపాటు దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్‌కు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్‌ రోడ్‌లోని 3వ నంబరు ఇల్లును ఖాళీ చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్‌ అధికారిక నివాసాన్ని ఇక్కడి సిబ్బంది ఖాళీ చేస్తున్నారు.

ఇప్పటికే కొంత సామాను తరలించిన సిబ్బంది.. రెండు మూడు రోజుల్లో ఈ ఇంటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్‌రావుకు ఈ బంగ్లాను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు ఇది అధికారిక నివాసంగా మారింది. ఈ ఇంటి నుంచే హస్తినలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమాన్ని నడిపించారు.

రాష్ట్ర సాధన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం హోదాలో హస్తినకు ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఆయన బస చేసేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజా ప్రతినిధి అయినా.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది. కానీ.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ ఇంటిని రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీ అయితే రెండు దశాబ్దాలుగా కేసీఆర్‌కు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది.

>
మరిన్ని వార్తలు