పాదయాత్ర చేసి... భరోసానిచ్చి...

3 Oct, 2014 01:22 IST|Sakshi
పాదయాత్ర చేసి... భరోసానిచ్చి...
  • బెజవాడలో సీఎంచంద్రబాబు బిజీబిజీ
  •  స్వచ్ఛభారత్, ఎన్టీఆర్ సుజల,  ఎన్టీఆర్ భరోసా పథకాలు ప్రారంభం
  •  రాజధానికి  రూ.3.60 కోట్ల విరాళాలు
  • సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేశారు.పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన  నగర శివారు ప్రాంతాల్లో సుమారు గంట సేపు కాన్వాయ్ ద్వారా పర్యటించి రాజధానిలోని ప్రాంతాలు, స్థితిగతులను తెలుసుకున్నారు. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా పథకాలకు గురువారం విజయవాడలో  శ్రీకారం చుట్టారు.  

    స్వచ్ఛభారత్‌లో భాగంగా 2.5 కిలోమీటర్ల మేర  పాదయాత్రలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వచ్చింది మొదలుకుని తిరిగి వెళ్లేంత వరకు బిజీబిజీగా గడిపారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు.  హైదరాబాద్ నుంచి  ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన  నేరుగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు వెళ్లకుండా విజయవాడ నగర పరిస్థితిని పరిశీలించేందుకు బయలుదేరారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ రూట్‌ను ఎంపిక చేసి సుమారు గంటపాటు సుడిగాలి పర్యటన చేశారు.  
     
    గన్నవరం నుంచి నిడమానూరు మీదుగా ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఏలూరు రోడ్డు మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్, పాలప్రొజెక్టు ఫ్లై ఓవర్, వైఎస్సార్(జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం)  కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, పైపుల రోడ్డు ప్రాంతాలను కాన్వాయ్ నుంచే కేంద్రమంత్రితో కలిసి పరిశీలించారు.
     
    మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సింగ్‌నగర్ పైపుల రోడ్డు సెంటర్‌లో జాతిపిత విగ్రహానికి పూలమాల వేసిన బాబు నివాళులర్పించారు. అనంతరం అక్కడ  ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి మార్గమధ్యంలో పలువురితో మాట్లాడారు. పాదయాత్రతో పాటుగా  సీఎం, కేంద్ర మంత్రి సైడుకాల్వల్లో పూడికలు తీసి, రోడ్డు ఊడ్చారు. అనంతరం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మొక్కలు నాటారు.
     
    పైపుల రోడ్డుసెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన బాబు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 12 గంటలకు ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్‌ను ప్రారంభించారు.
     
    అజిత్‌సింగ్ నగర్‌లో బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు’ సభలో వెయ్యి రూపాయల పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  జన్మభూమి కార్యక్రమం జరుగుతుందని,  తాను రోజుకో జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు.  అక్కడి నుంచి బయలుదేరి స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
       
    మధ్నాహ్నభోజన విరామం తర్వాత కొద్దిసేపు విశాంత్రి తీసుకుని అక్కడి నుంచి ఇరిగేషన్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకున్నారు. సాయంత్రం 5.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
     
    భారీగా విరాళాలు....

    స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో సీఎంను కలిసిన పలువురు రాజధాని నిర్మాణం కోసం భారీగా విరాళాలు అందజేశారు. కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సోసైటీ చైర్మన్ మండవ జానకి రామయ్య, డెరైక్టర్లు జాస్తి రాధాకృష్ణ, ఆర్జా నరేష్, వల్లభనేని బాబురావు, రత్నగిరి, అంజిరెడ్డి  రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబుకు రూ .2కోట్ల చెక్కును అందజేశారు. అలాగే పాల ఉత్పత్తిదారుల సొసైటీ రైతులు రూ.1.50 కోట్లు , జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్వరరావు రూ .10 వేలు అందజేశారు. నగరపాలకసంస్థ ఉద్యోగులు, ఇతర సంఘాలవారు పలు సమస్యలపై  వినతిపత్రాలు సమర్పించారు.
     
    సీఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యేలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, దాసరి బాలవర్థనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు