జోరువానలోనూ ఆగని సహాయక చర్యలు

15 Aug, 2017 23:57 IST|Sakshi
జోరువానలోనూ ఆగని సహాయక చర్యలు

వినుకొండ: బోరు బావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమేరకు ఆటంకం ఏర్పడినా సిబ్బంది మాత్రం వాటిని లెక్క చేయడం లేదు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం చిన్నారి చంద్రశేఖర్(2) ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.

తండ్రి మల్లికార్జున్‌తో పాటు పశువుల కొట్టం దగ్గరికి వెళ్లిన బాలుడు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. రెస్క్యూ టీమ్ చిన్నారిని బయటకు తీసేందుకు శాయశక్తులా యత్నిస్తోంది. సీసీ కెమెరాలను ఎన్డీఆర్ఎస్ బృందం బోరు బావిలోకి పంపింది. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌, గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు వర్షంలో కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

సుమారు 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నాడని అంచనా వేసిన అధికారులు.. చిన్నారిని బయటకు తీయగానే ఆస్పత్రికి తరలించడానికి డాక్టర్ల బృందం సిద్ధంగా ఉంది. పొక్లెయిన్‌తో బోరు బావికి సమాంతరంగా 50 అడుగుల మేర గోతిని తవ్వుతున్నారు.  బాలుడు ప్రస్తుతం ప్రాణాలతోనే ఉన్నాడని.. అతడిని సురక్షితంగా బయటకు తీస్తామని సిబ్బంది భావిస్తున్నారు.

కొద్ది నెలల కిందట  కొన్ని రోజుల కిందట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు