మండలానికో రీసోర్స్ భవనం

29 Jan, 2014 02:53 IST|Sakshi

ఇందూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రతి మండలంలో పంచాయతీ రాజ్ శాఖ రీసోర్స్ సెంటర్‌లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు పంచాయతీ శాఖ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోవాలన్నా... అధికారులు, పాలక వర్గాలు ఏదైనా హోట్‌ల్‌లోని కాన్ఫరెన్స్ హాటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

 స్థలాలు వెదకడం పూర్తికాగానే రీసోర్స్ సెంటర్ భవనాల నిర్మాణాల పనులు ప్రారంభమవుతాయి. ఐదు నెలల క్రితమే గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఏర్పాటు కాగా, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త పాలక వర్గాలకు పంచాయతీరాజ్ శాఖ తరపున శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అధికారులు కూడా శిక్షణ తరగతులను ఈ భవనాల్లో నిర్వహించుకోవచ్చు. రీసోర్స్ సెంటర్‌ల నిర్వహణ కోసం కో ఆర్డినేటర్, బిల్డింగ్ సూపర్‌వైజర్, సివిల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, డాటాఎంట్రీ ఆపరేటర్‌లను నియమిస్తారు.

 జిల్లా కేంద్రంలోనూ..
 మండల కేంద్రాల్లో పంచాయతీ రీసోర్స్ సెంటర్ల మాదిరిగానే జిల్లా కేంద్రంలోనూ జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణం కోసం  కోటి రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ భవన నిర్మాణం కోసం ముందుగా సిర్పూర్ గ్రామ శివారులో స్థలం వెదికారు.

 అయితే జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో దానిని రద్దు చేశారు.ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న క్వార్టర్‌లను కూలివేసి అక్కడ భవనాన్ని నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ భవనాన్ని త్వరితంగా నిర్మించేందుకు నిధుల విడుదల కోసం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

 సమావేశాలకు,శిక్షణ తరగతులకు అనువుగా ఉంటుంది... - సురేశ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి
 జిల్లాలో నిర్మించే రీసోర్స్ సెంటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు పాలక వర్గాలకు సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి. వేరే భవనాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని వార్తలు