అతివేగమే ప్రాణం తీసింది..

8 Jul, 2014 01:47 IST|Sakshi
అతివేగమే ప్రాణం తీసింది..
  • మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదం
  •  ఒకరు మృతి, ఇద్దరికిగాయాలు
  •  సోమవారం తెల్లవారుజామున బందరులో ఘటన
  •  బాధిత కుటుంబానికి నాయకుల పరామర్శలు
  •  ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
  • మచిలీపట్నం క్రైం : ప్రభుత్వం రూపొం దించిన నిబంధనలు అందరితో అమలు చేయించాల్సిన అధికారులు, ఉద్యోగులు తమకు అవి వర్తించవన్నట్లు  వ్యవహరిం చారు. ప్రధాన కూడళ్లలో నిదానంగా వాహ నాలు నడపాలని  ప్రచారం చేసే వారే అతివేగంతో వాహనం నడి ఓ నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మరో ఇద్దరిని  ఆస్పత్రులపాలు చేశారు. గుండెలను పిండే ఈ ఘట న సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు మచిలీపట్నంలో జరిగింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. ఆయనతో పాటు ఎస్కార్ట్ జీపులో డ్రైవర్, మరో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు. మంత్రి రవీంద్రను జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు వరకు తీసుకెళ్లిన ఎస్కార్ట్ సిబ్బంది ఆయన్ను అక్కడ దించి.

    రాత్రి 12 గంటల సమయంలో తిరిగి మచిలీపట్నం బయలుదేరారు. ఎస్కార్ట్ జీపు మచిలీపట్నంలోని చలరాస్తాసెంటర్ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జీపు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలబడిన ముగ్గురిని ఢీ కొంది. ఈ ఘటనలో పట్టణంలోని నిజాంపేటకు చెందిన శేగు రామకృష్ణ (39)తీవ్రగాయాలు అయ్యాయి. అతనితో పాటు ఉన్న నిజాంపేట వాసి శేగు నాగవెంకటశివరామప్రసాద్, ఈడేపల్లికి చెందిన చొప్పరపు గోపాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి.

    ఈ ప్రమాదంలో జీపు పల్టీలు కొట్టటంతో దానిలో ఉన్న కానిస్టేబుల్ ఎల్.హెచ్.కుమార్‌కు గాయాలయ్యాయి. షాక్ నుంచి వెంటనే తేరుకున్న ఎస్కార్ట్ సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తలించారు. గాయాలపాలైన వారిలో రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుంబసభ్యులు అతన్ని విజయవాడ టైమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రామకృష్ణ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మృతి చెందాడు.
     
    బాబాయి మృతదేహాన్ని చూసేందుకెళ్లి..
     
    ప్రమాదంలో మృతి చెందిన రామకృష్ణ పట్టణంలోని ఓ ఫ్యాన్సీ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం రామకృష్ణ బాబాయి తమ్మన రమేష్ అనారోగ్యంతో మృతి చెందారు. బాబాయి భౌతికకాయాన్ని చూసి, ఆ కుటుంబాన్ని పరామర్శిచేందుకు రామకృష్ణ చల్లరాస్తాసెంటర్‌లోని బాబాయి ఇంటికి వెళ్లాడు.

    అతనితో పాటు నాగవెంకటశివరామప్రసాద్, గోపాలకృష్ణ అక్కడికి వెళ్లారు. చనిపోయిన రమేష్ రామకృష్ణకు సొంత బాబాయి కావడంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. రామకృష్ణతో పాటు శివరామకృష్ణ, గోపాలకృష్ణ కూడా రాత్రికి అక్కడే ఉన్నారు. సుమారు మూడు గంటల సమయంలో నిద్ర వస్తుండటంతో టీ తాగేందుకు ఆ ముగ్గురు రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదవశాత్తు వారిపైకి దూసుకువచ్చింది.
     
    ఈ ప్రమాదాన్ని గ్రహించిన శివరామకృష్ణ, గోపాలకృష్ణ తృటితో తప్పించుకున్నారు. రామకృష్ణ మాత్రం ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
     
    ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రభాకరరావు

    మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు సోమవారం ఘటనాస్థలికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదంపై డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన చోట పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీతో జరిగిన ప్రమాదంపై తీసుకోవాల్సిన  చర్యలు గురించి మాట్లాడారు.

    ఎస్పీతో పాటు ఓఎస్‌డీ హృషికేశ్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందరు తహశీల్దార్ బి.నారదముని ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుడు రామకృష్ణ పూర్తి వివరాలు సేకరించారు. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. మృతుని కుటుంబానికి ఆపద్బంధు పథకం కింద నష్ట పరిహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
     

మరిన్ని వార్తలు