'వశిష్ట 'వీరులు.. ప్రమాదమైనా.. సై

25 Oct, 2019 13:30 IST|Sakshi
రాయల్‌ వశిష్టపడవను బయటకు తీసినసాహసికులు వీరే

మానవతా దృక్పథంతో ప్రాణాలు పణంగా పెట్టిన గజ ఈతగాళ్లు

అన్నిటికీ తెగించి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ధీశాలులు

కన్నీరింకిన గుండెలకు కొంత స్వాంతన ఇచ్చిన మంచోళ్లు

గోదావరి నదీ గర్భం నుంచి బోటు వెలికితీసిన విశాఖ మత్స్యకారులు

ఉప్పొంగిన గోదావరి ఉన్మత్త రూపంతో విరుచుకుపడి నిండు ప్రాణాలను కబళిస్తే... గుండెలోతుల్లోంచి ఉప్పొంగిన మానవత్వం ఆ ఉగ్ర గోదారితోనే పోరాడింది.  ఉరకలేసే ఉత్సాహంతో తన ఒడిలోకి వచ్చిన బిడ్డలను నదీమాత పొట్టన పెట్టుకుంటే.. గుండెల్లో ధైర్యం నిండిన మత్స్యకారుల సాహసం.. ఆ అభాగ్యుల పార్థివ దేహాలను ప్రాణాలకు తెగించి మరీ వెలికి తీసింది. నిండుగా ప్రవహించే నది ఎన్నో కుటుంబాల జీవితాల్లో కన్నీటి సుడులు సృష్టిస్తే.. సాటివారికి చేతనైనంతగా సాయపడాలన్న విద్యుక్త ధర్మం.. ఆ కుటుంబాలకు తమ ఆప్తులను కడసారి దర్శించే భాగ్యాన్ని కలిగించింది. పాపికొండల దారిలో.. గోదారి లోతుల్లో మునిగిన ‘వశిష్ట’ బోట్‌ను మన విశాఖకు చెందిన విశిష్ట సాహసికుల బృందం వెలికితీసి వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. అందరూ అసాధ్యమనుకున్న ఈ అసాధారణ ఘట్టాన్ని సాధ్యం చేసిన మనోళ్ల సాహసం అందరి మన్ననలను అందుకుంది. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా కొన్ని కుటుంబాల ఆశను తీర్చడానికేనని వినమ్రంగా చెప్పే ఈ సాహసికుల ధీరత్వాన్ని ‘సాక్షి’ మీ కళ్లముందుంచుతోంది.

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): వశిష్ట విషాదం.. కన్నీటి కెరటం! శోకాశ్రు సాగరం! ఆనందం కోసం అందాల పడవెక్కి.. అద్భుతాల గోదారిని తనివితీరా చూస్తూ.. పాపికొండల తీరం చేరాలన్న ఆరాటంతో బయల్దేరిన వారిని తల్లిలాటి గోదావరి అమాంతం మింగేస్తే.. ఎన్నో కుటుంబాలను ఉప్పెనలా ముంచేసిన కొండంత.. కడలంత.. దారుణం. ఈ ఘటన రాష్ట్రాన్నే కాదు..యావత్‌ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో కుటుంబాలను కన్నీటి సుడిగుండంలోకి నెట్టింది. ఆ ఘటనలో  కొందరి మృతదేహాలే మొదట లభ్యమయ్యాయి. బోట్‌ గోదారి గర్భంలోనే ఉండిపోయింది. అందులో మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండడంతో దానిని వెలికితీయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. దాన్నో సవాలుగా తీసుకుంది. రోజుల తరబడి ఎన్నో సంస్థలు.. నావికాదళ నిపుణులు ప్రయత్నించినా.. అది దుస్సాధ్యమైంది. చివరికి ధర్మాడి సత్యం అనే అపార అనుభవజ్ఞుడి నేతృత్వంలో పనిచేసిన ఓ బృందం.. చిట్టచివరి ప్రయత్నం చేయడానికి సంకల్పించింది. ఈ లక్ష్య సాధనకు విశాఖలోని ఓం శ్రీ శివ శక్తి డైవింగ్‌ సర్వీసెస్‌ సాయం తీసుకుంది. ఆ సంస్థకు చెందిన గజ ఈతగాళ్లు.. నిపుణులైన మత్స్యకారులు.. ప్రాణాలకు తెగించి.. శాయశక్తులా శ్రమించడంతో గోదావరి నదీగర్భంలోని రాయల్‌ వశిష్ట బోట్‌ ఉనికిని తెలసుకోవడం సాధ్యమైంది. ఈ సాహసికుల బృందం నానా పాట్లు పడి.. ఎట్టకేలకు పడవను గట్టుకు చేర్చగలిగింది. దాంతో పాటు దాదాపు 38 రోజుల పాటు కనిపించకుండా పోయిన 12 మంది పార్థివదేహాలను గట్టెక్కించి.. సంబంధిత కుటుంబాలకు కనీసం తమ వారిని కడసారి చూశామన్న సాంత్వనను కలిగించింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో మునిగిన పడవను విశాఖలోని బురుజుపేటకు చెందిన ఓం శ్రీ శివ శక్తి డైవింగ్‌ సర్వీసెస్‌ సిబ్బంది కనబరిచిన మానవతా దృక్పథం అందరి మన్ననలు అందుకుంది. బోటు వెలికితీతకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ వారిని కలిసినప్పుడు తమది ఓ ప్రయత్నమని వినమ్రంగా చెబుతూనే.. ఆ సంఘటన గురించి వివరించారు.

ఇలా ప్రారంభం
కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం.. బోటు తీసేందుకు ముందుకొచ్చి.. దాదాపు 20 రోజులకు పైగా ఎన్నో విధాలుగా యత్నించారు. యాంకర్లు వేశారు. రోప్‌లు కట్టారు. కొంతమేరకు తీయగలిగినా చివరకు తమకు సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. ఈ అసాధ్యాన్ని సాధించగలవారెవరని ప్రయత్నించి చివరకు విశాఖ వచ్చారు. విశాఖలో గల పలు డైవింగ్‌ సంస్థలను ఆశ్రయించారు. ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయని పరిస్థితుల్లో.. చివరగా వన్‌టౌన్‌లోని బురుజుపేటలో గల ఓం శ్రీ శివ శక్తి డైవింగ్‌ సర్వీసెస్‌ను ఆశ్రయించారు. అక్కడి సిబ్బంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. వరదపై ఉన్న గోదావరిలో.. దాదాపు 100 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికి తీయడం అసాధ్యమని తెలిసి కూడా.. మునిగిపోయిన బోటును వెలికి తీస్తే.. తమవారిని కడసారైనా చూడాలని తపిస్తున్న వారి కోరిక తీర్చవచ్చని భావించారు. దాంతో సవాలుకు సై అన్నారు. 

ఎనిమిది దిక్కులా యత్నం
ఎనిమిది మంది ఈతగాళ్ల బృందం ఒక్కొక్కరూ ఒక్కో వైపుగా బోటు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చీకటి పడింది. మొదటి రోజు సమయం మించిపోయింది. రెండో రోజు ఉదయం మళ్లీ యత్నించారు. బోటుకు చుట్టుపక్కలా పేరుకుపోయిన బురదను నానా కష్టాలు పడి తొలగించారు.  మూడు వైపులా రోప్‌ వేశారు. బోటు లోపల ఉండిపోయిన 12 మృతదేహాలు(డికంపోజ్‌ అయిన బాడీలు) ఒక్కొక్కటిగా తీశారు.

ఎన్నెన్నో కష్టాలు
ఓ వైపు దుర్వాసన..మరొవైపు చిమ్మ చీకటి.. ఇంకో వైపు నీటి ప్రవాహం జోరు.. కెరటాల ఒరవడి... ఇవన్నీ వారికి అవరోధంగా నిలిచాయి. అయినా పట్టు వదలని వీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి మన్ననలు అందుకున్నారు.

అంతా మత్స్యకారులే..
ఆపరేషన్‌ బోట్‌లో పాల్గొన్న వారంతా మత్స్యకారులే. వీరు పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి వేటే వీరి జీవనాధారం. వీరిలో చాలామందికి స్విమింగ్‌లో 10 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉంది. డైవింగ్‌ సంస్థ ద్వారా ఏమైనా పనులు ఉంటే..రోజుకి రూ.1500 నుంచి రూ.2వేలు మాత్రమే(ప్రాణాలు ఫణంగా పెట్టి) సంపాదిస్తుంటారు. మిగిలిన రోజుల్లో కూలీ పనులు చేస్తుంటారు. వీరంతా ఫిషింగ్‌ హార్బర్‌ పరిధిలోని వారే. బతుకుతెరువు కోసం..ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉండేందుకు వేటే జీవనాధారంగా ఎంచుకున్నారు.

ప్రమాదమైనా.. సై
తమ ప్రయత్నం ఎంత ప్రమాదకరమైనదో వారికి తెలుసు. గోదావరి ప్రవాహాన్ని.. సుడి గుండాన్ని దాటి.. దాదాపు వంద అడుగుల లోతులో కూరుకుపోయిన బోటును బయటకు తీయాలంటే తలకు మించిన పని అన్నది పూర్తిగా తెలుసు.  పైగా 38 రోజుల పాటు ఆ బోటులో చిక్కుకొని పాడైన మృతదేహాలను గుర్తించి.. బయటకు తీయడం ఎంతో కష్టమని తెలిసినా... వారు సిద్ధపడ్డారు.  ఓం శ్రీశివ శక్తి డైవింగ్‌ సర్వీసెస్‌కు చెందిన మారుపిల్లి దాసు, గనగల రాజాబాబు, కదిరి ఎల్లారావు, పిళ్లా ఎల్లాజీ, గనగల అప్పలరాజు, వాసుపల్లి మురళి, ఒలిశెట్టి కోటేశ్వరరావు, పొనమండ రమణ, బడే ఎల్లాజీ, పేర్ల నల్లరాజు, మారుపిల్లి సతీష్‌కుమార్‌ గత ఆదివారం ఉదయం బోటు మునిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడి సిబ్బంది అనుమతించలేదు. ఆ తర్వాత  ఎనిమిది మంది డైవర్లు (మారుపిల్లి దాసు, గనగల రాజాబాబు, కదిరి ఎల్లారావు, పిళ్లా ఎల్లాజీ, గనగల అప్పలరాజు, వాసుపల్లి మురళీ, ఒలిశెట్టి కోటేశ్వరరావు, పొనమండ రమణ) నీటిలోకి దిగారు. దాదాపు 80 అడుగుల లోతుకి వెళ్లారు. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ కాళ్లకు  బోటు పరికరాలు తగులుతూ ఉండడంతో.. అక్కడ బోటు ఉన్నట్టు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆక్సిజన్‌ను అంచనా వేసుకుంటూ ఓ ఇనుప తీగ వేశారు. పైనుంచి లాగే ప్రయత్నంలో ఆ రోప్‌ తెగిపడింది. మళ్లీ నీటిలో ఉన్న వారు మరో రోప్‌ కట్టారు. ముందుగా బోటు కేబిన్‌ను (ఇంజన్‌ ప్రాంతం) బయటకు తీయగలిగారు. దీంతో బోటును తీయగలమన్న నమ్మకం కలిగింది.

ఓం శ్రీశివశక్తి తోడ్పాటు
2012 ఆగస్టులో బురుజుపేటలో ఈ సంస్థ ప్రారంభమైంది. ఇక్కడ 30 మంది పనిచేస్తున్నారు. గతంలో నర్మదా నదిలో మునిగిన విమానాన్ని వెలికితీయడానికి నేవల్‌ డైవర్స్‌ నిస్సహాయత వ్యక్తం చేయగా.. ఈ సంస్థ సిబ్బంది వారం రోజుల్లోనే విమానాన్ని బయటకు తీయగలిగారు. కేరళ, ముంబై, పారాదీప్, చెన్నై, కాకినాడ, కోల్‌కత, హల్దియా, విశాఖపట్నంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొన్నారు. చేశారు. గోదావరి తీరంలో భద్రాచలం, గోవిందపల్లి వద్ద... విశాఖలో తాటిపూడి రిజర్వాయర్‌లో వెలికితీతకు సంబంధించి బాధ్యతలు నెరవేర్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు