ఆర్టీసీ మూసివేతకు కుట్ర’

5 May, 2015 23:55 IST|Sakshi

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఒక పథకం ప్రకారం ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతంరెడ్డి మండిపడ్డారు. సమ్మె నోటీసు నేపథ్యంలో రెండు నెలలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం ఇప్పుడు కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ వేతన సవరణపై ప్రభుత్వం రోజుకో డ్రామా ఆడుతోందని, న్యాయమైన హక్కుల కోసం కార్మికులు సమ్మెకు దిగితే డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటామని బెదిరించడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు.


ప్రభుత్వ ఉద్యోగులందరికి 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినప్పుడు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే నాటికి ఆర్టీసీ రూ. 45 కోట్ల లాభాల్లో ఉందని, ఆ తర్వాత పన్నులు వేయడం, రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా చేయడం వల్ల ఆర్టీసీ రూ. 3 వేల కోట్ల అప్పు చేయాల్సివచ్చిందని తెలిపారు.


దానిపై వడ్డీలు కలుపుకొని ఇప్పుడు రూ. 5వేలు కోట్లకు అప్పు చేరిందన్నారు. ఇలా ఆర్టీసీని ఇబ్బందులపాల్జేసిన చంద్రబాబు మళ్లీ సమ్మె పేరుతో ఆర్టీసీని మూసే దిశగా కుట్ర చేస్తున్నార ఆరోపించారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఆర్టీసీ 2007 నుంచి 2009 వరకు రెండేళ్లపాటు రూ.100 కోట్ల లాభాలు గడించిన సంగతి గుర్తుచేశారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మవద్దని, కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు