ఆర్టీసీ కార్మికుల సమ్మెతో భారీగా తగ్గిన రాబడి

13 May, 2015 04:48 IST|Sakshi

నెల్లూరు (రవాణా) : కార్మికుల సమ్మెతో ఆర్టీసీ రాబడికి భారీగా గండి పడింది. దూర ప్రాంతాలకు బస్సులును తిప్పకపోవడం, తాత్కాలిక ఉద్యోగులు, అధికారులు చేతివాటం ఆర్టీసీని మరింత పీకల్లోతు కష్టాల్లోకి తీసుకెళ్లింది. ఆర్టీసీ అధికారులు తమకు అనుకూలమైన వారికి విధులు అప్పగించి వసూలైన చార్జీల్లో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

7వరోజు ధర్నాలకే పరిమితం..
 కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని ఆయా డిపోల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్డాండ్ నుంచి గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లేబర్ కమిషనర్‌కు మెమొరాండం అందించారు.

 సమ్మె కొనసాగింపుకే మొగ్గు..
 రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సమ్మె కొనసాగిస్తామంటున్నారు. ముందుగానే నోటీసు ఇచ్చి చట్టబద్దంగా సమ్మె చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం మేరకే నడుచుకుంటామని పలు యూనియన్ల నాయకులు చెబుతున్నారు.

ఆర్టీసి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన
 నెల్లూరు (రవాణా) : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలంటూ మంగళవారం ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్డాండ్ సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయుకులు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వ బెదిరింపుల్లో భాగమేనన్నారు. కార్మికుల డిమాండ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో 40శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా ఏపీలో మాత్రం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయుకులు బాబూ శామ్యూల్, నారాయణ, ఎన్‌ఎంయూ నాయకులు కుమార్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఎంఆర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, కార్మిక్‌సంఘ్ నేతలు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 విధులకు హాజరైతే క్రమబద్ధీకరణ ఇన్‌చార్జి ఈడీ శశిధర్
 నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు బుధవారం విధులకు హాజరైతే క్రమబద్ధీకరించనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు జోన్ ఈడీ శశిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం హజరుకాకుంటే శ్వాశతంగా విధుల నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు