సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

31 May, 2014 02:01 IST|Sakshi
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ నాయకుల హెచ్చరిక
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: విశాఖపట్నం రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యవైఖరికి నిరసనగా శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ఈయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈయూ రీజనల్ అధ్యక్షుడు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం అర్బన్ ట్రాఫిక్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ ఎ.వీరయ్యచౌదరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూనియన్‌పై పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు.

విజయనగరం జోన్‌లోని నాలుగు రీజియన్‌లకు సంబంధించి  27 డిపోల్లో ఆర్టీసీ అధికారులు గుర్తింపు సంఘంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చార్టులు వేయాలని, టిమ్ డ్యూటీలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలుచేయూలని డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సులకు డబుల్ డోర్లు తీసివేయాలనే నిబంధన అమలు చేయకపోవడం విచారకరమన్నారు.

అద్దెబస్సుల డ్రైవర్లకు ఇన్‌సెంటివ్‌లు ఇస్తూ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కార్మికులకు పదోన్నతులు కల్పించాలని, ఏడీ, పీడీల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే జూన్  3వ తేదీన ఛలో ఈడీ కార్యాలయం చేపడతామని హెచ్చరించారు. ధర్నా లో ఈయూ డివిజనల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు, పి.నానాజీ, కె.శంకరరావు, శ్రీకాకుళం ఒకటో డిపో అధ్య క్ష, కార్యదర్శిలు జి.త్రినాథ్, ఎస్.వి.రమణ, జి.బి. మూర్తి, పి.వి.రావు, కె.వి.రమణ, బి.జయదేవ్, ఎం.టి.వి.రావు, కె.బి.రావు, పి.రమేష్, కె.బాబూరావు, సీహెచ్.కృష్ణారావు, కె.గోవిందరావు, ఎ.త్రినాథ్, ఎస్.ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు