'అరణ్య ' రోదన | Sakshi
Sakshi News home page

'అరణ్య ' రోదన

Published Sat, May 31 2014 1:54 AM

'అరణ్య ' రోదన - Sakshi

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీశాఖ బ్రేకులు
అటవీ అనుమతులు లభించక ఎక్కడి పనులు అక్కడే
కాకర్ల డ్యాం పరిధిలో 600 ఎకరాలకు అందని పరిహారం
ముంపు గ్రామాలకు ఆర్ ఆర్ ప్యాకేజీ నీటి మీద రాతే
{పాజెక్టులంటే గిట్టని టీడీపీ అధినేత చంద్రబాబు
ఆయన పాలనలో ప్రాజెక్టు పూర్తయ్యేది నిజమేనా?
{పాజెక్టు పూర్తిపై రైతుల్లో అనుమానాలు ..

 
 
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం..  జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజానీకం చిరకాల వాంఛ..  వేలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసే కల్పతరువు వెలిగొండ ప్రాజెక్టు..!
 
 
 అంతటి ప్రాచుర్యం పొందిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆగమేఘాల మీద కోట్లాది రూపాయల నిధులూ మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
 
కంభం రూరల్

పశ్చిమ ప్రాంత వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. పనుల పురోగతి ఒక అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. అధికారులు, ఆనాటి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వెలిగొండ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రాజెక్టులో భాగమైన  కాకర్ల ఆనకట్టకు సంబంధించిన కాలువ పనులు అటవీశాఖ అనుమతులు లభించక ముందుకు సాగడం లేదు. ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు పదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానేత వైఎస్సార్ జీవించి ఉంటే అటవీశాఖ అనుమతులు ఈ పాటికే వచ్చి ప్రాజెక్టు పనులు ఎప్పుడో  పూర్తయ్యేవని పశ్చిమ ప్రాంత రైతులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ మొదటి విడత రూ.206 కోట్లు, రెండో విడత రూ. 250 కోట్లు మొత్తం రూ. 456 కోట్లు మంజూరు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఆయన మంజూరు చేసిన నిధుల్లో ఇప్పటి వరకు రూ.320 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి కావాలంటే అటవీశాఖాధికారుల అనుమతులు అవసరం. అటవీశాఖకు పరిహారం కింద ప్రభుత్వం రూ.280 కోట్లు చెల్లించినా నేటికీ అనుమతులు లభించకపోవడం గమనార్హం.

తూర్పు కాలువ పొడవు 42.625 కిలోమీటర్లు (ప్రాజెక్టు నుంచి బేస్తవారిపేట మండలం పూసలపాడు వరకు) కాగా ఇప్పటి వరకు 32 కిలోమీటర్ల మేర పని మాత్రమే పూర్తి చేశారు. నాగులవరం- మొహిద్దీన్‌పురం, పెద్దనల్లకాలువ-  కృష్ణాపురం, కృష్ణాపురం - సంగాపేటల మధ్య అటవీ ప్రాంతం ఉండటంతో పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలపై అటవీశాఖ అనుమతుల కోసం పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలెవరూ ఒత్తిడి తేలేదు. డ్యాం నిర్మాణాన్ని వివిధ బ్లాకులుగా విభజించి ఇప్పటి వరకూ 80 శాతం పనులు పూర్తి చేసినట్లు సైట్ ఇన్‌చార్జి మల్లికార్జున తెలిపారు.  

 మోసపోయిన రైతులు

 కాకర్ల డ్యాం నిర్మాణంలో ముంపునకు గురవుతున్న 600 ఎకరాల భూములకు సంబంధించి రైతులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదు. అధికారులను కలిసి వేడుకున్నా.. పనులు అడ్డుకున్నా.. చివరకు బాధిత రైతులు నిరవధిక దీక్షలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. న్యాయం కోసం నాలుగేళ్ల కిందట రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 ఆర్‌ఆర్ ప్యాకేజీ ఉత్తుత్తిదే...

 ముంపు గ్రామాలకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామన్న ప్రభుత్వం మాటలు నీటి మీద రాతలయ్యాయి. ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, మొట్టిగుంజి, సాయిరాం నగర్, కృష్ణానగర్ ప్రజలకు పునరావాస ప్యాకేజీ కింద బేస్తవారిపేట మండలం ఒందుట్ల వద్ద స్థలాన్ని సేకరించి అక్కడ గృహాలు నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. మొదటి నుంచి ప్రాజెక్టులను వ్యతిరేకించే చంద్రబాబు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తారంటే ఈ ప్రాంత ప్రజలు ఎవరూ నమ్మడం లేదు.
 
పోరాటం చేస్తాం :ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యే, గిద్దలూరు

  పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా జరిగేందుకు పోరాటం చేస్తాం. ఒంగోలు ఎంపీ ైవె వీ సుబ్బారెడ్డి సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అటవీశాఖ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సాధిస్తాం. రైతుల శ్రేయస్సు కోసం వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుంది.
 

Advertisement
Advertisement