పాపం పిల్లలు

26 Nov, 2014 02:39 IST|Sakshi
పాపం పిల్లలు

ఏళ్లు గడుస్తున్నాయి.. కోట్ల రూపాయల నిధులు కరుగుతున్నాయి.. విద్యాభివృద్ధికి అంత చేస్తున్నాం.. ఇంత చే స్తున్నాం.. అని గొప్పులు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు బడిబయట పిల్లలను బడిగడప తొక్కించలేకపోతున్నారు. బడి బయట పిల్లలు లేరని తప్పుడు లెక్కలు చూపడం.. ఎంఈఓలు లేక పూర్తి స్థాయి పర్యవేక్షణ కరువైందని సాకు చెబుతుండటం పరిపాటిగా మారింది.  
 
సాక్షిప్రతినిధి, అనంతపురం :  ఐదేళ్లు నిండి 14 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్యను అందించడం విద్యాహక్కు చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ వయసు బాలబాలికలు ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి ఉచితంగా దుస్తులు, భోజనం, పుస్తకాలు అందించాలి. వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పించి వారికి విద్యా బుద్ధులు నేర్పించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించినా అవి అమలులో నిస్తేజంగా మారాయి. ప్రభుత్వ ధోరణి, అధికారులు చిత్తశుద్ధిలేమి కారణంగా వేల సంఖ్యలో బాలబాలికలు పాఠశాలలకు దూరంగా ఉన్నారు.

బాల కార్మికులుగా ఇంకా బడిబయటే ఉండిపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,737 మంది బాలకార్మికులు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో బాలురు 2,246, బాలికలు 1491 మందిఉన్నట్లు గుర్తించారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లతో చేయించిన సర్వేలో కూడా ఇదే సంఖ్య తేలినట్లు తెలుస్తోంది.

అయితే వాస్తవ సంఖ్యను కప్పిపుచ్చి కేవలం 30మంది మాత్రమే ఉన్నారని జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు ఎస్‌ఎస్‌ఏ అధికారులు వివరించారు. దీనిపై సోమవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకిలెక్కలు తెచ్చి చూపిస్తున్నారా? మీ పనితీరు చూస్తుంటే యునెస్కోతో అవార్డులు ఇప్పించాలనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించి మండిపడ్డారు. వాస్తవ సంఖ్యను తన ముందు ఉంచాలని ఆదేశించారు.

 ఐదేళ్లు నిండిన వారు 58 వేలుపైనే
  ఐదేళ్లు నిండి ఆరో సంవత్సరంలోకి ప్రవేశించిన చిన్నారులంతా విద్యాహక్కు చట్టం పరిధిలోకి వస్తారు. ఇలా ఐదేళ్లు నిండిన పిల్లలు జిల్లాలో 58   వేలకుపైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఐదేళ్లు నిండిన వారు 32,742 మంది దాకా నమోదయ్యారు. నమోదుకాని వారి సంఖ్య ఇంకా 25 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. విద్యా సంబరాల్లో భాగంగా వీరందరినీ పాఠశాలల్లో గానీ, ఆర్‌ఎస్‌టీ సెంటర్లలో గానీ, కేజీబీవీలలో చేరేలా చూడాలి. జిల్లాలో ఆర్‌ఎస్‌టీ సెంటర్లు లేవు.

దీంతో బాలకార్మికులపై అధికారులు నిర్తిప్తత ప్రదర్శిస్తున్నారు. బాలికలను కస్తూర్భా(కేజీబీవీ) బాలికా విద్యాలయాల్లో చేర్పించి, వారికిఅన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించి, విద్యా బుద్ధులు నేర్పాలి. అయితే కేజీబీవీల ప్రత్యేక అధికారులు పాఠశాల నిర్వహణకే పరిమితమవుతున్నారు. బడిబయట బాలికలను గుర్తించడం, వారిని పాఠశాలల్లో చేర్పించడంపై శ్రద్ధ చూపడం లేదు.

 వేధిస్తున్న ఎంఈఓల కొరత
 బడిబయట పిల్లలు అధికంగా ఉండేందుకు జిల్లాలో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 12 మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. తక్కిన 51 మండలాల్లో ఇన్‌చార్జ్ ఎంఈఓలు కొనసాగుతున్నారు. వీరు వారి పాఠశాలల బాధ్యతతో పాటు ఎంఈవో విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంది. దీంతో డ్రాపౌట్స్‌పై దృష్టి సారించలేకపోతున్నారు. పైగా జిల్లాలో ప్రాథమి విద్యను పూర్తి చేసుకుని ఉన్నత పాఠ శాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు స్కూలు మానేయకుండా చూడాలి.

ఈ అంశంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసుకున్న వారు జిల్లాలో 69, 278 మంది ఉన్నారు. వీరిని ఆరో తరగతిలోకి చేర్పించాల్సిన బాధ్యత వారు చదువు పూర్తి చేసుకున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే. ఏడవ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతిలోకి ప్రవేశించాల్సిన వారు 71,962 మంది ఉన్నారు.

విద్యాహక్కు చట్టం ఎనిమిదవ తరగతి వరకు అమలు అవుతుండటంతో వీరందరినీ కచ్చితంగా 8వ తరగతిలోకి చేర్పాంచాల్సి ఉంది. కానీ అధికారుల ఉదాసీనతతో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా అమలు కావడం లేదు. దీంతో డ్రాపౌట్స్‌పై విద్యాశాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. కలెక్టర్ ఆదేశాలతోనైనా ‘అనంత’ బాలకార్మికులు బడిగడప తొక్కుతారా.. బలపం చేత పడతారా.. అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు