మరింత ఉధృతంగా..

2 Nov, 2013 04:12 IST|Sakshi
మరింత ఉధృతంగా..

సాక్షి నెట్‌వర్క్ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సహా ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వబోమంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంది. వరుసగా 94వరోజైన శుక్రవారం కూడా రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. విశాఖలో ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో భారీ మానవహారం నిర్వహించారు.
 
 న్యాయవాదులు కోర్టు వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమలాపురం, పెద్దాపురంలలో సమైక్యవాదులు అమరజీవి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబాజీపేటలో విద్యార్థులు సమైక్య గర్జన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు సమైక్యవాదులు, ఏన్జీవోలు పాలాభిషేకాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోవిద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. విజయనగరంలో న్యాయవాదుల బైక్ ర్యాలీని పోలీసులు భగ్నంచేసి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిని పోలీస్ వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో  శ్రీకాకుళంలో భారీ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు.
 
వర్షంలో తడుస్తూ...
వైఎస్సార్ జిల్లా బద్వేలులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో వర్షంలోనే తడుస్తూ నిరసన చేపట్టారు. కడపలో ఎన్జీఓలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వృథాగా పోనీయ్యబోమని ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులు ప్రతినబూనారు. అనంతపురంలో  ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు, ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. గుంతకల్లు, కదిరి, లేపాక్షిలో విద్యార్థులు మహా మానవహారం నిర్మించారు. హిందూపురంలో  భారీ ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో ఎన్జీవోలు, న్యాయవాదులు, మెడికల్ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో గాండ్ల, చేనేత, బలిజ సంఘాలు విద్యార్థిగర్జన నిర్వహించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మానవహారం నిర్వహించారు.
 
 అఖిలపక్షంలో సమైక్యవాదం వినిపించండి
 ‘కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ సమావేశంలో సమైక్యవాదం వినిపించి తీరాలి. లేకపోతే ఆయా పార్టీల నాయకులను రోడ్లపై తిరగనివ్వం’ అని కర్నూలు జిల్లా విద్యాసంస్థల జేఏసీ నాయకులు హెచ్చరించారు.కర్నూలులో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగసభ నిర్వహించారు. నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు