మండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారు..

23 Jan, 2020 16:11 IST|Sakshi

సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌

సాక్షి, విజయవాడ: రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు అనర్హుడని.. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌ అన్నారు. ఈ నెపంతో రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని పెంచాలనే కుట్రతో 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే.. వేల కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాశ్వత హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు లేవని.. తాత్కాలిక భవనాలతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేల ఎకరాలను దోచేశారని ధ్వజమెత్తారు.

13 జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని.. టీడీపీ దీనిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి మాత్రమే కాదని..13 జిల్లాల అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరాచకం సృష్టించారని తెలిపారు. చంద్రబాబు, చైర్మన్‌లు కలిసి శాసనమండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.

అభివృద్ధిని అడ్డుకుని..చంద్రబాబు పైశాచిక ఆనందం..
నిన్నటి రోజు చరిత్రలో బ్లాక్‌డే గా మిగిలిపోతుందని సోషల్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాథం అన్నారు. చంద్రబాబు మంది బలంతో చట్టాలను చుట్టంగా చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల బలం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుని చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 సంవత్సరాల అనుభవంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చేసిన కుటిల రాజకీయాలు మండలి సాక్షిగా బహిర్గతమయ్యాయన్నారు.  

చంద్రబాబు రాయలసీమ ద్రోహి..
రాయలసీమ వాసులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సోషల్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర నేత రాజ్‌కుమార్‌ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు మండలిలో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమ రాజధాని కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాజ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు