పడగ విప్పిన ఇసుక మాఫియా!

16 Apr, 2019 13:18 IST|Sakshi
పొక్లెయిన్‌తో ఇసుక తవ్వేయడంతో ఏర్పడిన గోతులు

యనమలకుదురు కృష్ణానదిలో తవ్వకాలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

రోజుకు వంద లారీల లోడు తరలింపు

పెనమలూరు: యనమలకుదురులో ఇసుక మాఫియా పడగ విప్పింది. పవిత్ర కృష్ణానది నుంచి దొంగచాటుగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. ఇసుక మాఫియా రోజుకు వంద లారీల ఇసుక తరలించి అమ్ముకుంటున్నా చర్యలు లేవు. యనమలకుదురు నుంచి పటమటలంక వరకు కృష్ణానది ఒడ్డున 25 అడుగుల ఎత్తులో వాల్‌ నిర్మాణం జరిగింది. కృష్ణానదికి వరద వస్తే నివాసాలు మునిగి పోకుండా ఉండటానికి ఈ వాల్‌ నిర్మించారు. అయితే ఇసుక మాíఫియాకు నది ఒడ్డున నిర్మించిన ఈ వాల్‌ అడ్డాగా ఎంతగానో ఉపయోగపడుతోంది. యనమలకుదురు ర్యాంప్‌ నుంచి ఇసుక మాఫియా పొక్లయిన్‌ను యనమలకుదురు గ్రామ సరిహద్దులోనుంచి కృష్ణానదిలోకి తీసుకు వెళ్లి పొదలచాటున దాచి ఉంచుతున్నారు. అలాగే 10 లారీలు, పది ట్రాక్టర్లను రంగంలోకి దించి పొక్లయిన్‌తో ఇసుక లోడ్‌ చేసి గుట్టుచప్పుడవ్వకుండా యనమలకుదురు ర్యాంప్‌ మార్గం నుంచి అక్రమంగా విజయవాడ నగరానికి తరలిస్తున్నారు. నదిలో ఇసుక తవ్వకాలకు వాల్‌ అడ్డంగా ఉండడంతో బయటకు కనబడటం లేదు. కొద్ది కాలంగా మాఫియా ఇసుక దందా విచ్చలవిడిగా చేస్తోందని గ్రామస్తులు తెలిపారు.

రెవెన్యూ, పోలీసులు ఏం చేస్తున్నారో..?
యనమలకుదురు ర్యాంప్‌ నుంచి రోజూ లారీలు, ట్రాక్టర్లతో ఇసుక పెద్ద ఎత్తున తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కొందరికి ముడుపులు అందడంతో మౌనంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని చెబుతున్నారు. రౌండ్స్‌లో తిరిగే పోలీసులు, వీఆర్వోల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నదిలో పొక్లయిన్, లారీలు, ట్రాక్టర్లు కనిపిస్తున్నా అధికారులు ఎందుకు దాడులు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు.

సిండికేట్‌గా ఇసుక మాఫియా..
అక్రమ దందా వెనుక ఇసుక మాఫియా సిండికేట్‌ పని చేస్తోంది. దాడులు జరగకుండా ఉండటానికి కొందరికి ముడుపులు చెల్లిస్తున్నారని సమాచారం. నదిలో కిలోమీటరున్నర దూరంగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతుండడంతో ఎవ్వరికి ఈ తవ్వకాలు కనబడడం లేదు. పగలు, రాత్రిళ్లు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక మాఫియా దాడులు జరగకుండా ఉండటానికి టీడీపీ నేతల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. కాగా నదిలో ఇసుక తరలిస్తున్న లారీ ఫొటోలు యనమలకుదురు ర్యాంప్‌ వద సోమవారం ‘సాక్షి’తీసే యత్నం చేయగా లారీలను నదిలోకి తీసుకువెళ్లి పొదలమాటున దాచేశారు. అధికారులు రంగంలోకి దిగితే ఇసుక మాఫియా గుట్టు రట్టవుతుందని స్థానికులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు