పల్లె మేలుకునే వేళ..!

13 Jan, 2020 13:02 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి శోభ

స్వస్థలాలకు చేరుకుంటున్న వారితో కళకళ

పల్లె మేలుకునే వేళయ్యింది. భోగి మంటల వెలుతురులో తన వైభవాన్ని తిరిగి చూసుకునేందుకు సిద్ధమైంది. నయనాందకరమైన రంగు, రంగుల రంగువళ్లులు.. వేకువజామునే వీనుల విందుగా వినిపించే హరిదాసుల సంకీర్తలు.. జంగమదేవరల సిద్ధేశాల ఘంటారావం.. డూడూ బసవన్నల శోభాయమాన అలంకారం.. కొత్త అల్లుళ్లు, బంధువులతో గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి పండగకు ముస్తాబయ్యాయి. అచ్చతెలుగుదనం ఉట్టిపడే పెద్ద పండగకు సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి.

సాక్షి, అమరావతి: రాష్ట్రం సంక్రాంతి పండుగకు ముస్తాబైంది. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలు, వెళ్లిన వారంతా స్వస్థలాలకు చేరుకుంటుండటంతో పండుగ ముందే వచ్చిందా అన్న చందంగా పల్లెలు కళకళలాడుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను ఆనందంతో జరుకునేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు జనం మార్కెట్లకు ఎగబడటంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.  

కొత్త ఆలోచనలు చిగురించాలి...
భోగభాగ్యాల భోగి..సాంప్రదాయాల సంక్రాంతి..కష్టాలను తీర్చే కనుమ పండుగల సమయంలో ప్రజలు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. సూర్యోదయం వేళ ప్రజలంతా చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవున్ని వేడుకుంటూ, ఇందుకు గుర్తుగా ఇళ్లల్లో పాత చెక్క సామగ్రి బోగిమంటల్లో వేస్తుంటారు. భోగి రోజునే చిన్నారులపై రేగిపండ్లు, చిల్లరనాణేలను  తలపై పోసి ముత్తయిదువులు దీవించడం విశేషం. 
 

ముత్యాల్లాంటి ముగ్గులు..
లక్ష్మీదేవి ప్రతీకగా భావించే రంగవల్లులు సంక్రాంతి వేళ ఇళ్లముందు కొలువుదీరుతుంటాయి. కల్లాపి జల్లి విభిన్న ఆకృతుల్లో పండగకు స్వాగతం పలుకుతూ ముగ్గులు వేస్తుంటారు. పూలతో అలంకరించి గొబ్బెమ్మలను పెట్టి భక్తిపాటలను ఆలపిస్తారు.

పుణ్యప్రదమైన సంక్రాంతి...
ధనురాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన పర్వదినమే మకర సంక్రమణంగా పెద్దలు చెబుతారు.  ధాన్యరాసులు రైతన్న ఇంటికి చేరి పాడిపంటలతో వెలుగులను నింపేది ఈ పెద్దపండుగ. పలు రకాల పిండివంటలను చేసి సూర్యభగవానికి నివేదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కాడెద్దులకు పూజలు చేస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలుచేసి పెద్దలకు చూపించడం ఆనవాయితీగా వస్తోంది.


అలరించే హరిదాసుల కీర్తనలు

హరిలోరంగ హరి అంటూ హరిదాసుల కంచుగజ్జెలు ఘల్లుఘల్లుమనగ చిందులు తొక్కుతూ చిడతలు, తలపై రాగి పాత్రలతో హరిదాసులు ప్రత్యక్షమవుతారు. మరోవైపు జంగమదేవరలు, బుడబుక్కలదొరలు ఇంటింటికీ తిరుగుతూ పెద్దలను కీర్తిస్తుంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేయిస్తారు.

స్నేహానికి చిహ్నం నేస్తరికం
మిత్తమ్మ.. మొఖర.. వరిపండు.. గాదె.. ఇవేవో కొత్త పదాల్లా ఉన్నాయి కదూ.. అదేం కాదండి.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంజిల్లా ప్రజల స్నేహానికి ప్రతీక పదాలు. వేరే కులానికి చెందిన అమ్మ కాని అమ్మలను మిత్తమ్మ అని, బావ వరుసయ్యే వ్యక్తులను మొఖర, మహిళల్లో వదినె వరుసయ్యే వారిని వరిపండు, గాదె అంటూ ఆప్యాయతతో పిలుచుకుంటారు. ఇకపోతే నేస్తరికంగా దైవసాక్షిగా కట్టుకుని, జీవితాంతం నేస్తం అంటూ పిలుచుకుంటారు. వీరంతా సంక్రాంతికి ఆతిధ్యం ఇవ్వడం.. వస్త్రాలు, దుస్తులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. ప్రత్యేక వంటలను వండి భోజనాలకు పిలుచుకుంటారు.

ఆనందాన్నిచ్చే పండగ
ఆరోజుల్లో సంక్రాంతి అంటే ఇంట్లో ఒక పండుగ వాతావరణంలా ఉండేది..పెద్దపండుగ వచ్చిందంటే ఆ నెలంతా ఇంట్లో పండుగలా ఉండేది. ఉమ్మడికుటుంబాల వ్యవస్థ నుంచి ఉద్యోగ, ఉపాది దృష్యా ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా మారింది. సెల్‌ఫోన్‌ల ప్రభావం పండుగల మీద పడింది. ఆ నాటి ఆప్యాయ పలకరింపులు నేడు సెల్‌ఫోన్‌లకే పరిమితమైయ్యాయి. బోగి బోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. రైతాంగానికి, ప్రజానీకానికి ఎంతో ఆనందాన్నిచ్చే పండుగ.
– తెన్నేటి నర్సింగరావు, జ్యోతిష్యుడు

మరిన్ని వార్తలు