ఉక్కు మనిషిని ఆదర్శంగా తీసుకోవాలి

16 Dec, 2013 07:17 IST|Sakshi
కర్నూలు(స్పోర్ట్స్), న్యూస్‌లైన్:  దేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పటేల్ విగ్రహ కమిటీ జిల్లా చైర్మన్ కె.వి.సుబ్బారెడ్డి అన్నారు. పటేల్ విగ్రహ నిర్మాణ యజ్ఞం కోసం నగరంలో ఆదివారం 2కే రన్‌ను నిర్వహించారు. పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బయలుదేరిన రన్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సర్కిల్, కిడ్స్ పార్కు మీదుగా, జిల్లాపరిషత్ నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. రాజ్‌విహార్ సెంటర్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 
 అక్కడ నుంచి శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్, కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రన్ కొనసాగింది. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే 182 మీటర్లు ఎత్తై పటేల్ విగ్రహ ప్రతిష్టకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి శ్రీకారం చుట్టడం ఎంతో గర్వకారణమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఎనలేని సేవలను చేశారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు, ఐ.వి.శేఖర్‌రెడ్డి, కపిలేశ్వరయ్య, కాళింగి నరసింహ వర్మ, జి.ఎస్.నాగరాజు, కో-ఆర్డినేటర్ సాయిశేఖర్‌రెడ్డి, దాదాపు 500 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.    
మరిన్ని వార్తలు