‘సామాజిక అంశానికి పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్‌’

19 Dec, 2019 16:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : . రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న ఎస్సీల ఆకాంక్షలకు అనుగుణంగా పనిస్తామని మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు తెలిపారు. తాడేపల్లిలోని ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ సంక్షేమ సహాయకార ఆర్థిక సంస్థ రాష్ట్ర కార్యాలయంలో గురువారం షెడ్యూల్ క్యాస్ట్  సొసైటీ అధికారులతో మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్‌లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్‌లు పి.అమ్మాజీ, కె.కనకారావు, వి.మధుసూధనరావుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈడీలు, ఈవోలు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో పాలనపరమైన అంశాలపై అధికారులతో చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమపై ఉంచిన బాధ్యతలను నేరవేరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని పేర్కొన్నారు. 13 జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు ఈ  సమావేశము ఏర్పాటు చేశామని మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెడపాటి అమ్మాజీ అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించామని, అన్ని జిల్లాల్లో అవగాహన క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల వద్దకే పాలన అనేలా నీతి ,నిజాయితీ, నిబద్దతతో  పనిచేస్తామని తెలిపారు. 

రెల్లి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు మధుసూధనరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మంచి ఫలితాల అందేలా పనిచేస్తామని, సామాజిక న్యాయం అమలుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక  అంశానికి పెద్ద పీట వేసిన నాయకుడు సీఎం జగన్‌ అని, గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు