రుణం.. గగనం

22 Jul, 2014 04:36 IST|Sakshi

కడప రూరల్: గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరం అస్తవ్యస్తంగా సాగింది. అలాంటి తరుణంలోనే నాటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు లక్ష్యాలను, బడ్జెట్ (సబ్సిడీ)ను ఘనంగా కేటాయించింది. దీంతో ఆయా వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి. సబ్సిడీ రుణాలతో లబ్ధి పొందవచ్చని అందరూ భావించారు. అయితే, అనుకున్నదొకటి... జరిగింది మరొకటి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులు రుణాలు అందక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

 అన్నీ కష్టాలే!
 గడిచిన ఆర్థిక సంవత్సరంలో రుణాల ప్రక్రియ కష్టాలతో ప్రారంభమైంది. రుణ మంజూరుకు కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. బ్యాంకు లింకేజీ కింద రుణాల మంజూరుకు ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీని జమ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ విధానంతో తమకు సబ్సిడీ నేరుగా బ్యాంకులలో పడుతుందని, తద్వారా రుణ మొత్తాన్ని పొందవచ్చని ఆశపడ్డారు. అనంతరం గడిచిన డిసెంబరు 31వ తేదీన రుణాల మంజూరు ప్రక్రియకు సంబంధించి 101 జీఓను ప్రభుత్వం జారీ చేసింది.

 ఆ జీఓ ప్రకారం వయస్సు నిబంధనను విధించారు. రేషన్‌కార్డును తప్పనిసరి చేశారు. దీంతో రుణాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఎంతోమంది ఆ జీఓ కారణంగా అనర్హులుగా మారారు. మిగిలిన కొంతమంది నిబంధనల ప్రకారం రుణ అర్హతను పొందారు. అర్హతను పొందిన వారు తమకు రుణాలు వస్తాయని ఆశపడ్డారు. అయితే, వారి ఆశ నిరాశగా మారింది. ప్రభుత్వం లక్ష్యాలను ఆలస్యంగా ప్రకటించింది. అంతలోనే ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఫలితంగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.

 ఈ తరుణంలో ప్రభుత్వం సకాలంలో స్పందించక పోవడం వల్ల అతికొద్ది మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. ఈ నేపథ్యంలో కోడ్ ముగిసింది...తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నెలలు గడుస్తున్నప్పటికీ రుణాల ఊసే లేకపోవడం, సబ్సిడీ నిధుల ప్రస్తావనే వినిపించకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వారు అసలు రుణాలు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే గతంలో కూడా రుణానికి అర్హత పొందినప్పటికీ ఆయా శాఖలకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను కేటాయించకపోవడం వల్ల రుణాలు పొందలేక పోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం అర్హుల్లో గూడు కట్టుకుంది.
 
 ఎస్టీ బీసీల పరిస్థితి దారుణం
 కాగా, ఎస్టీలకు 194 యూనిట్లు, అందుకోసం రూ. 1.38 కోట్ల సబ్సిడీని కేటాయించారు. అలాగే బీసీ వర్గాలకు 3134 యూనిట్ల కోసం రూ. 9.40 కోట్ల సబ్సిడీని కేటాయించగా, ఆయా వర్గాలకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాకపోవడం, ఒక్కరు కూడా రుణాలు పొందలేకపోయారు. దీంతో ఆయా వర్గాలు తమకు రుణాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు.

 2014-15 రుణాలకు మోక్షం ఎప్పుడో?
 సాధారణంగా ప్రతి యేటా జూలైలో ఆయా శాఖలకు రుణ లక్ష్యాలను, బడ్జెట్ కేటాయింపులను నిర్దేశిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2013-14కు సంబంధించిన రుణాలే పూర్తి కాలేదు. ఇక ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరానికి రుణాలను ప్రభుత్వం ఎప్పుడు కేటాయిస్తుందో అంతుచిక్కడం లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన వారు రుణాల ద్వారా లబ్ధి పొందాలని భావించారు. అయితే రుణాలు మంజూరయ్యే పరిస్థితి కనుచూపు మేర కనిపించకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు