విద్యార్థులకు ‘పోలీస్‌ విధులు, చట్టాలు’ సిలబస్‌

21 Mar, 2018 11:52 IST|Sakshi
మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తున్న ఏఎస్పీ

‘స్టూడెంట్‌ క్యాడెట్‌ పోలీస్‌’ ప్రారంభం   

జిల్లాల్లో 10 స్కూల్స్‌ ఎంపిక

నెల్లూరు(క్రైమ్‌): చట్టాన్ని గౌరవించే సమాజాన్ని నిర్మించేందుకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలన్నదే స్టూడెంట్‌ క్యాడెట్‌ పోలీస్‌ ప్రోగ్రాం (ఎస్‌సీపీపీ) నిర్వహణ ముఖ్య ఉద్దేశమని ఏఎస్పీ బి. శరత్‌బాబు అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో ఎస్‌సీపీపీ కార్యక్రమాన్ని ఏఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లోని 8,9 తరగతులు చదివే విద్యార్థులకు పోలీసు వ్యవస్థ, పోలీసులు విధులపై అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాఠశాల స్థాయి నుంచే పౌర నియమాలను పాటించడం, చట్టాలపై అవగాహన పెంపొందించుకుని అసాంఘిక చర్యలకు అడ్డుకట్టవేయడం అలవడుతుందన్నారు. చిన్నతనం నుంచే పోలీసు వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉంటే భవిష్యత్‌లో పోలీసుశాఖకు సేవలందించే ఆలోచలనలతో పాటు చట్టాలపై  పూర్తి అవగాహన కలిగి ఉంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలోనూ ఎస్‌సీపీపీ అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. నగరంలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్, కేఏఎస్‌ వ్యాస్‌ పోలీసు స్కూల్, ముత్తుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, కోవూరు జేబీఆర్‌ ఉన్నత పాఠశాల, గూడూరు  జెడ్పీ ఉన్నత పాఠశాల, నాయుడుపేట ఏపీఆర్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ ఉన్నత పాఠశాల, కావలి ఎస్‌పీఎస్‌ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కలిగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు ఎల్‌ఆర్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పొదలకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలల్లో చదివే 8, 9 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేసి వారానికి ఒకసారి ప్రభుత్వం ఇచ్చిన పోలీసు సిలబస్‌ను బోధిస్తామన్నారు. దీని వల్ల విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేయడంతో పాటు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా చిన్నారులను తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు ప్రాజెక్టర్లు, కంప్యూటర్‌లు, స్క్రీన్‌లు, ఆడియో సిస్టమ్‌లు, ట్రాఫిక్‌ పరికరాలు అందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, రాఘవరెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు