ఎస్పీని బదిలీ చేయాలని బీఎస్పీ పట్టు

16 Oct, 2023 11:12 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎస్పీ సురేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పట్టుబట్టడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మూడురోజుల క్రితం ఆర్‌ఎస్పీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సురేశ్‌కుమార్‌ ఎస్పీగా కొనసాగితే జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

ఓ మాజీ ఐపీఎస్‌ అధికారి.. విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో అటు పోలీస్‌శాఖ, రాజకీయ, వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఎస్పీ సురేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను తాను సన్మానించిన ఫొటోలు పాతవని, షెడ్యూల్‌ విడుదలయ్యాక పక్కాగా ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్లు ఎస్పీ సురేశ్‌కుమార్‌ వివరించారు. అయితే బీఎస్పీ మాత్రం అందుకు సంతృప్తి చెందక ఎస్పీని బదిలీ చేయాలంటూ పట్టుబడుతోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అధికారవర్గాలు ఆరా తీస్తున్నాయి.

ఎన్నికల కమిషన్‌ ఆరా?
ఎస్పీని బదిలీ చేయాలని ఫిర్యాదు రావడం, అందులో కొన్ని ఆధారాలు కమిషన్‌కు ఇవ్వడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. అలాగే రాష్ట్ర పోలీస్‌శాఖ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే సమాచారం తీసుకుంది. ఈ ఫిర్యాదులో వాస్తవమెంత? అనే కోణంలో ఆధారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిర్పూర్‌ ఎమ్మెల్యేగా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌పై రాజకీయ కోణంతో పాటు ఇతర కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన క్షణం నుంచే కోడ్‌ అమల్లోకి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ష న్‌ కమిషన్‌ అధీనంలోనే పని చేయాల్సి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా కమిషన్‌ ఆదేశాలు పాటించాల్సిందే. బదిలీలు, ఇతర చర్యలు తీసుకోవచ్చు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అధికార పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పది మంది ఐపీఎస్‌లు, నలుగురు కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తప్పించి బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో వేరే అధికారులను నియమించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎస్పీ పైనా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది.

మరిన్ని వార్తలు